Andhra Pradesh: ఇక తేల్చేద్దాం... మంత్రులతో కీలక సమావేశానికి కూర్చున్న చంద్రబాబు!

  • విభజన హామీల అమలే లక్ష్యం
  • కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కలు సిద్ధం
  • మరింత ఒత్తిడి తేవడంపై చంద్రబాబు దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీల అమలే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం అందుబాటులో ఉన్న మంత్రులతో కీలక సమావేశాన్ని ప్రారంభించారు. విభజన హామీలు అమలు కాకుంటే పార్టీకి కలిగే నష్టం, బీజేపీ, టీడీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్న తీరు, బీజేపీ అధిష్ఠానంతో వ్యవహరించాల్సిన వైఖరిపై చంద్రబాబు బృందం చర్చలు ప్రారంభించింది.

బీజేపీ నేతలు తమంతట తామే టీడీపీతో పొత్తును వదులుకుని, మంత్రి పదవులకు రాజీనామాలు చేస్తామని వ్యాఖ్యానించడంతో, ఈ విషయమై ఇక నాన్చివేత వద్దనే ధోరణిలో టీడీపీ మంత్రులు ఉన్నట్టు తెలుస్తుండగా, కేంద్రంపై ఒత్తిడి పెంచేలా భవిష్యత్ కార్యాచరణ, పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

అమరావతిలో జరుగుతున్న ఈ సమావేశపు ఎజెండా ఒకే ఒకటని, కేంద్రం ఇచ్చిన నిధులు, విభజన హామీల అమలుపైనే నేతలు చర్చిస్తున్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అమరావతి, పోలవరం తదితరాంశాలకు కేంద్రం ఇచ్చిన నిధులు, ఖర్చులపై గణాంకాలను సిద్ధం చేసి, కేంద్రం చెబుతున్న లెక్కలకు, రాష్ట్రానికి వచ్చిన నిధులకు మధ్య ఉన్న తేడాపైనా చంద్రబాబు చర్చిస్తున్నారు.

More Telugu News