Kamal Haasan: ఢిల్లీ, కేరళ, బీహార్ సీఎంలు... కమల్ కు మద్దతు తెలిపేందుకు మధురై చేరుకుంటున్న ముఖ్యమంత్రులు!

  • నేడు కమల్ పార్టీ ప్రకటన
  • హాజరు కానున్న పినరయి, కేజ్రీవాల్, నితీశ్
  • మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ ఆహ్వానం
  • భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్న అభిమాన సంఘాలు

నేటి సాయంత్రం 6 గంటలకు తాను ప్రారంభించనున్న కొత్త పార్టీ, పేరును ప్రకటించనున్న కమలహాసన్ కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ సాయంత్రం మధురైలో జరిగే భారీ బహిరంగ సభ వేదికపై ఆయన తన పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించనుండగా, పలువురు వీవీఐపీలు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, బీహార్ సీఎం, జనతాదళ్ యునైటెడ్ చీఫ్ నితీశ్ కుమార్ లు హాజరు కానున్నారు.

వీరితో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ సీఎంలు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, కే చంద్రశేఖర్ రావులను కూడా కమల్ ఆహ్వానించారని తెలుస్తుండగా, వారు పాల్గొంటారా? లేదా? అన్న విషయమై అధికారిక ప్రకటన వెలువడలేదు. మధురైలోని 'ఓక్స్' గ్రౌండ్ వేదికగా ఈ బహిరంగ సభ జరుగనుండగా, ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ ఎత్తున జనసమీకరణ చేసేందుకు మధురైతో పాటు చుట్టుపక్కల జిల్లాలైన తేని, విరుద్ నగర్, రామనాథపురం, శివగంగై, దిండిగల్, పుదుకొట్టాయ్, తిరుచిరాపల్లి, కరూర్, తిరువూర్, తంజావూరు, నాగపట్టణం తిరునల్వేలి ప్రాంతాల్లోని అభిమాన సంఘాల నేతలు నడుంబిగించారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరుకానున్న ముఖ్యమంత్రులు మధ్యాహ్నానికి మధురై చేరుకుంటారని కమల్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 

More Telugu News