Kochadaiiyaan: రజనీ భార్యకు సుప్రీం నోటీసులు... 'కొచ్చాడియాన్' బాకీలు చెల్లించాలని ఆదేశం!

  • రూ.6.2 కోట్లు, దానికి వడ్డీ చెల్లించాలని ఆదేశం
  • మూడు నెలల గడువిచ్చిన న్యాయస్థానం
  • ఇదే కేసులో 2016లోనే నోటీసుల జారీ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. 'కొచ్చాడియాన్' చిత్రానికి సంబంధించి యాడ్ బ్యూరో కంపెనీకి బాకీపడిన రూ.6.20 కోట్లను దాని వడ్డీని పన్నెండు వారాల్లోగా చెల్లించాలని కోర్టు ఆమెను ఆదేశించింది. ఈ కేసు కొచ్చాడియాన్ చిత్రం పంపిణీ హక్కుల విక్రయానికి సంబంధించినది.

యాడ్ బ్యూరో కంపెనీ, 'మీడియా వన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్', లతా రజనీకాంత్‌ల మధ్య 2016కి ముందే హక్కుల వివాదం మొదలయింది. ఈ చిత్రం నిర్మాణానంతర పనుల కోసం తమను ఉపయోగించుకున్నారని, ఏప్రిల్, 2014లో సినిమా పూర్తి కావడానికి మీడియా వన్‌కి తాను పది కోట్ల రూపాయల రుణం కూడా ఇప్పించామని పిటిషనర్ (యాడ్ బ్యూరో) ఆరోపించింది.

రుణం మొత్తానికి తాను హామీనంటూ లతా రజనీకాంత్ సంతకం చేశారని కూడా గుర్తు చేసింది. కానీ, చివర్లో ఈ చిత్రం తమిళనాడు పంపిణీ హక్కులను మీడియా వన్ తనను సంప్రదించకుండానే ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు విక్రయించిందని యాడ్ బ్యూరో ఆరోపించింది. కాగా, ఈ చిత్రం హక్కుల విక్రయానికి సంబంధించి యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వినతి మేరకు జులై 8, 2016న సుప్రీంకోర్టు లతా రజనీకాంత్‌కి నోటీసు పంపిన సంగతి తెలిసిందే.
Kochadaiiyaan
Supreme Court
Latha Rajinikanth
Media One Global Entertainment
Ad Bureau

More Telugu News