Priya Prakash: అంత అర్జెంట్ కాదులే... రేపు విచారిస్తాం: ప్రియా వారియర్ పిటిషన్ పై సుప్రీంకోర్టు

  • రాత్రికి రాత్రే పాప్యులర్ అయిన ప్రియా ప్రకాశ్
  • పలు పోలీసు స్టేషన్లలో కేసులు
  • అన్నింటిపైనా స్టే ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించిన నటి
తనపై దేశవ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదవుతున్నందున వాటన్నింటిపైనా స్టే విధించాలని మాలీవుడ్ నయా సెన్సేషన్ ప్రియా ప్రకాశ్ వారియర్ వేసిన పిటిషన్ పై రేపు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రియా ప్రకాశ్ నటించిన మలయాళ చిత్రం 'ఒరు అదార్ లవ్' లోని ఓ పాట వీడియో బయటకు రాగానే, రాత్రికి రాత్రే ఆమె పాప్యులర్ అయిన సంగతి తెలిసిందే. అదే ఆమెకు కష్టాలను తెచ్చిపెట్టింది.

ఆ పాట ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా వుందని ఆరోపిస్తూ, ప్రియా ప్రకాశ్, చిత్ర నిర్మాతలపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రియ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ బీరేన్ వాదనలు వినిపిస్తూ, తన క్లయింట్ పిటిషన్ ను అర్జంటుగా విచారించాలని కోరారు. అంత అత్యవసరంగా నేడే పిటిషన్ ను విచారించాల్సిన అవసరం లేదని, రేపు విచారణకు స్వీకరిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఆ చిత్రంలో వాడుకున్న పాట కేరళలో ఎన్నో దశాబ్దాలుగా ఫేమస్ అని, రచయిత నుంచి అనుమతి తీసుకునే పాట రీమిక్స్ ను నిర్మాతలు వాడుకున్నారని ఆయన కోర్టుకు వివరించారు. కాగా, ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది.
Priya Prakash
Malayalam
Supreme Court

More Telugu News