Andhra Pradesh: పది లక్షల మందితో తిరుగుబాటు మహాసభ నిర్వహిస్తాం: మంద కృష్ణ మాదిగ

  • పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు డిమాండ్ చేస్తున్నాం
  • అమరావతిలో ఏప్రిల్ 2న తిరుగుబాటు మహాసభ
  • తెలంగాణలో 24 గంటల బంద్ నిర్వహిస్తాం

పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టించాలని డిమాండ్ చేస్తూ అమరావతిలో తిరుగుబాటు మహాసభ నిర్వహించనున్నట్టు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వెల్లడించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతిలో ఏప్రిల్ 2న పది లక్షల మందితో తిరుగుబాటు మహాసభ నిర్వహిస్తామని అన్నారు. ఈ మహాసభ విజయవంతం కోసం రెండు విడతలుగా ప్రచార యాత్రలు చేపడతామని చెప్పారు.

ఈ నెల 25న తిరుపతిలో ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో మొదటి విడత ప్రచారయాత్ర, మార్చి 21న రెండో విడత ప్రచార యాత్రను చిత్తూరులో ప్రారంభించి ఏప్రిల్ 1వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏపీ బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఒప్పించి పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టించాలని డిమాండ్ చేశారు. అలా చెయ్యని పక్షంలో బీజేపీ యేతర పార్టీలను ఈ మహాసభకు ఆహ్వానిస్తామని అన్నారు.

తెలంగాణలో  24 గంటల బంద్ నిర్వహిస్తాం

ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఇరవై నాలుగేళ్లుగా సాగుతోందని, దీనికి సంకేతంగా తెలంగాణలో 24 గంటల బంద్ నిర్వహిస్తామని మంద కృష్ణ అన్నారు. మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో బంద్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతలను ఈరోజు, రేపు కలుస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సహకారం కూడా కోరతామని, ఆయన అపాయిట్ మెంట్ కోరుతూ ఓ లేఖ రాస్తున్నట్టు చెప్పారు. పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందేందుకు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

ఈ నెల 23 నుంచి బంద్ సన్నాహక సదస్సులు

హైదరాబాద్ లో ఈ నెల 23 నుంచి బంద్ సన్నాహక సదస్సులు ప్రారంభిస్తామని మంద కృష్ణ పేర్కొన్నారు. బంద్ కు రెండు రోజుల ముందుగా జిల్లా కేంద్రాల్లో, ఒక రోజు ముందు అఖిలపక్షంతో కలిసి సన్నాహక సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు.

More Telugu News