Vikram Kothari: ఇండియాలోనే ఉన్నానన్న 'రొటొమాక్' విక్రమ్ కొఠారీ... వెంటనే వెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు!

  • రూ. 800 కోట్లకు పైగా బ్యాంకు రుణాలు తీసుకున్న కొఠారీ
  • వాటిని సకాలంలో తిరిగి చెల్లించడంలో విఫలం
  • ఆయన కంపెనీని ఎన్పీఏగా ప్రకటించిన బ్యాంకులు

అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకుల నుంచి రూ. 800 కోట్లకు పైగా రుణాలు పొంది వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమైన బాల్ పాయింట్ పెన్స్ తయారు చేస్తున్న 'రొటొమాక్' సంస్థ అధినేత విక్రమ్ కొఠారీని కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. నీరవ్ మోదీ మాదిరిగానే కొఠారీ కూడా విదేశాలకు పారిపోయారని నేడు అన్ని దినపత్రికల్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విక్రమ్ ఓ ప్రకటన వెలువరిస్తూ, తాను కాన్పూర్ లోనే ఉన్నానని, ఎక్కడికీ పారిపోలేదని ప్రకటించగా, ఆ వెంటనే పోలీసులు వెళ్లి అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు.

అంతకుముందు ఆయన చేసిన ప్రకటనలో "ముందుగా చెప్పేది ఏంటంటే, ఇది కుంభకోణం కాదు. నేను ఎక్కడికీ వెళ్లలేదు. నేను భారత పౌరుడినే. నా ఊరిలోనే ఉన్నాను. నా కంపెనీలను నిరర్ధక ఆస్తిగా బ్యాంకులు ప్రకటించాయి. నేనేమీ బ్యాంకులకు డబ్బులను ఎగ్గొట్టిన వ్యక్తిని కాదు. ఈ మొత్తం వ్యవహారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో విచారణ దశలో ఉంది. బ్యాంకుల అధికారులతో నేను నిత్యమూ మాట్లాడుతూనే ఉన్నాను. వారికి సహకరిస్తున్నాను. తీసుకున్న రుణాలను త్వరలోనే చెల్లిస్తా" అని అన్నారు.

 కాగా, 1980వ దశకంలో విపరీతంగా మార్కెటింగ్ అయిన 'పాన్ పరాగ్' బ్రాండ్ సృష్టికర్త దీపక్ కొఠారీ సోదరుడే విక్రమ్ కొఠారీ. వారి కుటుంబం 1990ల్లో విడిపోగా, విక్రమ్ సొంతంగా రొటొమాక్ పేరిట స్టేషనరీ వ్యాపారం ప్రారంభించి అనతి కాలంలోనే పేరు గడించారు.

More Telugu News