ఇంక డబ్బులొద్దన్నాడు... ఇంత సీరియస్ అనుకోలేదు: గుండును తలచుకుని కన్నీరు పెట్టిన శివాజీరాజా

19-02-2018 Mon 09:24
  • ఎన్నో చిత్రాల్లో కలసి నటించాం
  • ఆరోగ్యం బాగాలేని వేళ డబ్బు సేకరించాం
  • ఇక చాలని చెప్పాడు... అంతలోనే ఇలా
  • మా అధ్యక్షుడు శివాజీరాజా
ఈ తెల్లవారుజామున మరణించిన హాస్య నటుడు గుండు హనుమంతరావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన తరువాత మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు శివాజీరాజా కన్నీటి పర్యంతమయ్యారు. గుండుతో తన అనుబంధాన్ని తలచుకున్నారు. తామిద్దరమూ ఒకటి, రెండు సినిమాల తేడాతో చిత్ర రంగంలోకి ప్రవేశించామని, 'కళ్ళు' చిత్రంలో తనది చూపులేని పాత్ర అయితే, ప్రధాన పాత్ర ఆయనదేనని చెప్పారు. ఆపై ఎన్నో చిత్రాల్లో కలసి నటించామని గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో ఆయన ఎవరి వద్దా చేయి చాచి అడగలేదని అన్నారు.

ఆయన ఆరోగ్యం బాగాలేకుంటే, కేసీఆర్, కేటీఆర్, చిరంజీవి వంటి వారెందరో సాయం చేశారని, మొత్తం ఎంత డబ్బు పోగయిందో తాను లెక్కలు చెబితే, "ఇక చాలు, ఆపరేషన్ కు సరిపోతాయి. మరెవరి వద్దా తీసుకోవద్దు" అని ఆయన చెప్పారని, గత మూడు రోజులుగా జరుగుతున్న నాటకోత్సవాలకు ఆయన రాకపోతే, ఆరోగ్యం బాగాలేదని అనుకున్నానే తప్ప, ఇంత సీరియస్ గా ఉందని తనకు తెలియలేదని కన్నీరు పెట్టారు. మధురానగర్ లో తామిద్దరమూ పక్క పక్క ఇళ్లలో ఉండేవాళ్లమని, గుండు చాలా మంచి వ్యక్తని, అటువంటి వ్యక్తిని కోల్పోవడం తనకెంతో బాధను కలిగిస్తోందని అన్నారు. వారి కుటుంబానికి 'మా' అండగా ఉంటుందని చెప్పారు.