Andhra Pradesh: ఇక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం.. మిత్రపక్షం దాడిని తిప్పికొడతాం!: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

  • విభజన హామీలు అమలు చేసేందుకు చాలా సమయం ఉంది
  • సంక్షేమ పథకాల మొత్తాలను రెవెన్యూ లోటులో కలపడం సరికాదు : విష్ణుకుమార్ రాజు
  • ఏపీకి బీజేపీ ద్రోహం చేసిందనడం సబబు కాదు
  • ప్రజల అపోహలను తొలగించేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకుంటాం: ఆకుల సత్యనారాయణ

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నిలదీసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ నేతలు అంటున్నారు. విజయవాడలో సమావేశానంతరం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, మిత్రపక్షం తమపై చేస్తున్న దాడిని తిప్పికొడతామని అన్నారు. విభజన హామీలు అమలు చేసేందుకు చాలా సమయం ఉందని, సంక్షేమ పథకాల మొత్తాలను రెవెన్యూ లోటులో కలపడం సరికాదని అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి రాకపోవడం సరికాదని, ప్రజల కోసం తామే ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పారు. ఒక ఎంపీ తక్కువ కావడంతో నాడు ప్రభుత్వాన్ని వదులుకున్న చరిత్ర బీజేపీదేనని, ఇప్పుడు, అవసరం లేకపోయినా పక్క పార్టీ వాళ్లను తమ పార్టీలోకి లాక్కునేవాళ్లను చూస్తున్నామని విమర్శించారు.

‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అని సంబోధిస్తూ, ఏదో ఘన కార్యం సాధించినట్టు కొంత మంది భావిస్తున్నారని, ‘మిస్టర్ చీఫ్ మినిస్టర్’ అనే కుసంస్కారం తమకు లేదని అన్నారు. బీజేపీకి చెందిన మరో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ, ఏపీకి బీజేపీ ద్రోహం చేసిందనడం సబబు కాదని, ప్రజల అపోహలను తొలగించేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకుంటామని అన్నారు. బీజేపీకి మిత్ర పక్షంగా ఉంటూ దిష్టి బొమ్మలు తగలబెట్టడం టీడీపీకి తగదని అన్నారు.

More Telugu News