Yadadri narasimha swamy temple: యాదాద్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి షురూ.. పదకొండు రోజుల పాటు ఉత్సవాలు!

  • 11 రోజుల పాటు వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు
  • ఈ నెల 24న తిరుకల్యాణోత్సవానికి సీఎం కేసీఆర్ దంపతులు
  • 27న స్వామి వారి శృంగార డోలోత్సవంతో ముగింపు

పవిత్ర యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువయిన శ్రీ లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ నెల 24న జరిగే తిరుకల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి వారు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అదే రోజు గవర్నర్ నరసింహన్ కూడా హాజరవుతారు. రాత్రి కొండ కింద నిర్వహించే కల్యాణంలో గవర్నర్ దంపతులు పాల్గొంటారు. భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులకు వినోదం పంచే దిశగా ఈ నెల 22న ధార్మిక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు. మరోవైపు గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బాలాలయంలోనే ఉత్సవాలు జరపాలని ఆలయ పాలకవర్గం నిర్ణయించింది.

స్వామి తిరుకల్యాణం, రథోత్సవాలను ఈ సారీ రెండు సార్లు నిర్వహిస్తారు. ఉత్సవాలకు శనివారం అంకురార్పణ పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఆదివారం ధ్వజారోహణం నిర్వహిస్తారు. 19న మత్స్యావతారం, అలంకారసేవ, శేషవాహనసేవ, 20న శ్రీకృష్ణాలంకారం, రాత్రి హంసవాహన సేవ, 21న వటపత్రసాయి అలంకారసేవ, రాత్రి పొన్నవాహనసేవ ఉంటాయి. 22న గోవర్థనగిరిధారి అలంకారసేవ, రాత్రి సింహవాహన సేవ, 23న జగన్మోహిని అలంకార సేవ, రాత్రి అశ్వవాహన సేవ (స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమం), 24న హనుమంత వాహనం, రాత్రి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 25న శ్రీ మహావిష్ణువు అలంకారం, గరుడవాహన సేవ, రాత్రి 8 గంటలకు స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం, 26న ఉదయం 11 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రస్నానం, 27న స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.

More Telugu News