Vice President Venkaiah Naidu: గూగుల్ కన్నా 'గురువే' మిన్న: ఉప రాష్ట్రపతి వెంకయ్య

  • ప్రతి ఒక్కరూ సంస్కృతీసంప్రదాయాలను గౌరవించాలి
  • పంచెకట్టంటే ఇష్టమన్న వెంకయ్య
  • ఆంగ్లానికి వ్యతిరేకం కాదని, మాతృభాషను నేర్వాలని సూచన

సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ, గురువు స్థానాన్ని ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్‌ ఎన్నటికీ భర్తీ చేయలేదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. తిరువనంతపురంలో శుక్రవారం జరిగిన శ్రీ చితిర తిరునాల్ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. "నేడు, ప్రపంచం శరవేగంగా దూసుకుపోతోంది. మీకు గూగుల్ అందుబాటులో ఉన్నా సరే మీకో గురువు అవసరం. గురువును గూగుల్ భర్తీ చేయలేదు" అని ఆయన అన్నారు. నేటి ఆధునిక శకంలోనూ ప్రతి ఒక్కరూ మన సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించాలని ఆయన కోరారు.

తల్లి, మాతృభూమి, మాతృభాష, గురువులను ఎప్పటికీ మర్చిపోరాదని ఆయన సూచించారు. ఏ హోదాలో ఉన్నా తనకు పంచె కట్టు అంటే ఇష్టమని ఆయన చెప్పారు. వస్తధారణతో వ్యక్తులకు గుర్తింపు రాదని, చేసే పనులను బట్టి వస్తుందని వెంకయ్య అన్నారు. ఎంత పెద్ద పదవులను చేపట్టినా సరే సంప్రదాయాలను గౌరవించాలని, మన ఆచార వ్యవహారాల పట్ల స్వాభిమానంతో ఉండాలని ఆయన సూచించారు. ఇదే కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల తన సాధారణ వస్తధారణ గురించి ప్రస్తావించినపుడు ఉప రాష్ట్రపతి ఈ మేరకు స్పందించారు. మరోవైపు ఆంగ్ల భాషకు తాను వ్యతిరేకంకాదని, కానీ, ప్రతి ఒక్కరూ తమ మాతృభాషకు ప్రాధాన్యతను ఇవ్వాలని, ఇళ్లలో నేర్వాలని ఆయన సూచించారు.

More Telugu News