baba: బాబా అవతారమెత్తి రూ.10 కోట్లకు పైగా వసూలు చేసిన టీచర్‌!

  • ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తోన్న సుధాకర్
  • మనీ స‌ర్క్యులేష‌న్‌ స్కీమ్ మాదిరిగా డబ్బులు వసూలు
  • డబ్బంతా కాజేసి తీసుకెళ్లిన సుధాకర్ అనుచరులు
  • నెల్లూరు నగరంలోని ప్రశాంతినగర్‌లో ఘటన

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తోన్న సుధాకర్ అనే వ్యక్తి బాబా అవతారమెత్తి ఏకంగా రూ.10 కోట్లకు పైగా వసూలు చేసిన ఘటన నెల్లూరు నగరంలోని ప్రశాంతినగర్‌లో చోటు చేసుకుంది. చివరకు అసలు విషయం భక్తులకు తెలియడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన సదరు ఉపాధ్యాయుడు పురుగుల మందుతాగి ఆసుపత్రి పాలయ్యాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే, ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలే పెట్టుబడిగా, బాబాలపై భక్తులకు ఉన్న నమ్మకమే ఆసరాగా మహారాజ్ బాబాపేరుతో సుధాకర్... భక్తులను పూజల పేరిట నమ్మించాడు. మంచి కన్నా చెడు వాయు వేగంతో వ్యాప్తి చెందుతుందన్న చందంగా ఆయన పేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మారు మోగి పోయింది. ఏపీ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఆయన వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్లేవారు.

దీంతో సుధాకర్‌కు మరింత దుర్భుద్ధి పుట్టింది. 103 రోజులు హోమం చేస్తే మంచి జరుగుతుందన్న పేరుతో భక్తుల నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాడు. మనీ స‌ర్క్యులేష‌న్‌ స్కీమ్ మాదిరిగా డబ్బులు వసూలు చేశాడు. మొత్తం 10 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. భక్తులు ఇచ్చిన డబ్బును బస్తాల్లో వేసిన సుధాకర్ ఇటీవల అర్ధరాత్రి ఓ చోటుకి తరలించాలని చూశాడు. ఆ క్రమంలో ఆయన వద్ద పనిచేసే నలుగురు సిబ్బంది ఆ డబ్బంతా తీసుకుని పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆయన ఆశ్రమం వద్దకు భారీగా తరలివచ్చారు. దీంతో సుధాకర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. 

More Telugu News