Uber: 'తలపాగా.. గడ్డం వాళ్లు నాకు నచ్చరు' అంటూ సిక్కు డ్రైవర్‌పై తుపాకి ఎక్కుపెట్టిన అమెరికన్!

  • మాతృదేశం, సేవ అంశాలపై ఇరువురి మధ్య వాగ్వాదం
  • శృతిమించిన మాటలు..జోక్యం చేసుకున్న మహిళా ప్యాసింజరు
  • నిందితుడ్ని అరెస్టు చేయలేదన్న బాధితుడి తరపు లాయర్

తలపాగా ధరించిన వాళ్లు, గడ్డం ఉన్న వాళ్లు తనకు అసలు నచ్చరంటూ సిక్కు మతానికి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్‌ తలపై ఓ అమెరికన్ ప్యాసింజరు తుపాకీ ఎక్కుపెట్టాడు. గతనెల 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీని గురించి రాక్ ఐలాండ్ కౌంటీ షెరీఫ్ జెర్రీ బస్టోస్ 'ది వాషింగ్టన్ పోస్టు'కు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గతనెల 28న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో ఇద్దరు ప్రయాణికులను తలపాగా ధరించిన ఊబర్ క్యాబ్ డ్రైవర్ గుర్జీత్ సింగ్ తన కారులో మోలైన్ వద్ద ఎక్కించుకున్నాడు. వారు చెప్పినట్లుగా తన కారును మిలాన్ వైపుగా నడిపించాడు. ప్రయాణిస్తున్న సమయంలో కారులోని మగ ప్రయాణికుడుకి, డ్రైవర్‌కి మధ్య మాటామాటా పెరిగింది.

వారిద్దరి మధ్య ప్రధానంగా స్వస్థలం, మాతృదేశానికి సేవ లాంటి విషయాల పరంగా మాటలు వాదానికి దారితీశాయి. ఇక్కడ (అమెరికా) నీ హోదా ఏంటి? మీ దేశమేది? నువ్వు మీ దేశానికి సేవ చేస్తావా? లేదా మా దేశానికి చేస్తావా? అంటూ డ్రైవర్‌ని అతను వరుసగా ప్రశ్నలు వేసినట్లు స్థానిక సిక్కు సంఘం తెలిపింది. అమెరికా పౌరసత్వం కలిగిన డ్రైవర్ గుర్జీత్ సింగ్ అటు అమెరికా, ఇటు భారత్ రెండు దేశాలకు సేవ చేస్తానని బదులిచ్చాడు. కానీ, తలపాగా ధరించిన వారంటే తనకు నచ్చదంటూ అతను డ్రైవర్ తలపై తుపాకీ ఎక్కు పెట్టాడని సంఘానికి సంబంధించిన అమృత్ కౌర్ తెలిపారు.

వాగ్వాదం వల్ల సింగ్ కారును ఆపేశాడు. ఆ సమయంలో అదే కారులో ఉన్న మహిళా ప్యాసింజరు నిందిత ప్యాసింజరును కారులోంచి కిందికి నెట్టేసింది. డ్రైవర్‌కి క్షమాపణ చెప్పి కారును ముందుకు నడిపించమని కోరిందని కౌర్ చెప్పారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు బాధితుడు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు నిందితుడ్ని అరెస్టు చేయలేదని ఆమె అన్నారు. కాగా, అమెరికాలోని సిక్కులకు తరచూ ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకు కారణం, వారి వేషధారణ చూడటానికి అచ్చం ముస్లింల మాదిరిగానే ఉండటం. దీనివల్ల పలు జాత్యహంకార ఘటనల్లో తరచూ బాధితులవుతుండటం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News