Pawan Kalyan: పవన్ డెడ్ లైన్ ముగిసినా ఏమీ చెప్పని టీడీపీ, బీజేపీ!

  • విభజన తరువాతి సాయంపై వివరాలు కోరిన పవన్
  • నిన్నటితో ముగిసిన డెడ్ లైన్ - ఏమీ చెప్పని ప్రభుత్వాలు
  • తదుపరి తీసుకోవాల్సిన నిర్ణయాలపై నేడు చర్చలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత, ఏపీకి కేంద్రం నుంచి అందిన నిధులు, చేసిన సాయంపై పూర్తి వివరాలను అందించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన డిమాండ్ పై అటు కేంద్ర ప్రభుత్వంగానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వంగానీ స్పందించలేదు. పవన్ పెట్టిన డెడ్ లైన్ నిన్నటితో (ఫిబ్రవరి 15)తో ముగిసినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి వివరాలూ అందలేదు. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల గురించిన సమాచారం మొత్తం పారదర్శకమేనని, వివరాలన్నీ ప్రభుత్వ వెబ్ సైట్లలో ఉంటాయన్న ఒక్క మాట మాత్రమే కొందరు టీడీపీ మంత్రుల నోటి నుంచి రాగా, అసలు ఏ అధికారంతో పవన్ ఈ వివరాలు కోరుతున్నారో చెప్పాలని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.

ఇక తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోలేకపోయిన పవన్ కల్యాణ్, రాష్ట్రానికి అందిన సాయంపై నిజ నిర్ధారణ కమిటీని వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మధ్యాహ్నం నుంచి జేఎఫ్సీ సమావేశాలు ప్రారంభం కానుండగా, విభజన హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విరుద్ధ ప్రకటనలపైనే తొలి చర్చలు సాగనున్నట్టు తెలుస్తోంది. టీడీపీ, బీజేపీల తీరుపై మిత్రులతో చర్చించనున్న పవన్ కల్యాణ్, తదుపరి ఏ విధంగా ముందడుగు వేయాలన్న విషయమై ఓ అంచనాకు వస్తారని జనసేన నేతలు చెబుతున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, వామపక్ష నేతలు కూడా హాజరు కానుండటం, ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాష్ నారాయణ్ వంటి రాజకీయ నిపుణులు తమ సలహాలు ఇవ్వనుండటంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది.

More Telugu News