Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీకి ఘాటుగా సమాధానం ఇచ్చిన సైన్యం

  • సైన్యానికి మతం ఉండదు
  • సర్వ ధర్మ స్థల్ అనే సూత్రాన్ని పాటిస్తాం
  • మతం రంగు పులిమి లబ్ధి పొందాలనుకుంటున్నారు

సంజువాన్ లో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లలో ఐదుగురు ముస్లింలు ఉన్నారని... దేశం పట్ల ముస్లింలకు ఉన్న ప్రేమ, చిత్తశుద్ధిని ప్రశ్నించేవారికి ఈ ఉదంతం ఒక కనువిప్పు కావాలంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దేశం కోసం ముస్లింలు ప్రాణత్యాగం చేస్తున్నప్పటికీ... తమను పాకిస్థానీయులు అంటూ ముద్ర వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై సైన్యం ఘాటుగా స్పందించింది.

సైనికులను తాము మత కోణంలో ఎన్నడూ చూడలేదని సైన్యం ఘాటు సమాధానం ఇచ్చింది. మీలాంటి వాళ్లే ఆ పని చేస్తున్నారంటూ పరోక్షంగా విమర్శించింది. సైన్యం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమేనని చెప్పింది. తాము సైన్యాన్ని మత కోణంలో ఎన్నడూ చూడలేదని... 'సర్వ ధర్మ స్థల్' అనే సూత్రాన్ని తాము పాటిస్తామని ఆర్మీ ఉత్తర విభాగం లెఫ్టినెంట్ జనరల్ దేవరాజ్ అన్భు తెలిపారు. అమరవీరులకు మతం రంగు పులిమి లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఒవైసీకి పరోక్షంగా చురకలు అంటించారు. భారత సైనికులకు మతం ఉండదనే విషయం వారికి తెలియకపోయి ఉండవచ్చని అన్నారు. వారి దేశ భక్తిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.

More Telugu News