Shanavi Ponnusamy: నాకు ఉద్యోగం ఇవ్వడం లేదు.. ఇక మరణమే శరణ్యం!: ట్రాన్స్ జండర్ ఆవేదన

  • లింగమార్పిడి కారణంగా ఉద్యోగం నిరాకరణ 
  • అర్హత, అనుభవం ఉన్నా ఉద్యోగం ఇవ్వడం లేదని ఆవేదన
  • కోర్టు ఖర్చులు భరించలేకపోతున్నానని వెల్లడి

ఇంజనీరు, మోడల్, నటిగానే కాక ఓ జాతీయ స్థాయి ఎయిర్‌లైన్ సంస్థలో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌గా అనుభవమున్న తమిళనాడు ట్రాన్స్ ఉమన్ షన్వి పొన్నుసామి తాను జీవించాలా? లేక మరణించాలా? అనేది రాష్ట్రపతి చేతుల్లోనే ఉందని స్పష్టం చేసింది. లింగమార్పిడి చేయించుకున్న కారణంగా ఎయిరిండియా విమానయాన సంస్థ తనకు ఉద్యోగాన్ని నిరాకరించిందని, ప్రస్తుతం తనకు బతుకు భారమైందని, కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ ఆమె రెండ్రోజుల కిందట రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తనకు అర్హత, అనుభవం ఉన్నాసరే ట్రాన్స్ ఉమన్‌కు ఏ విభాగం కిందా ఉద్యోగం ఇవ్వడం లేదని ఎయిరిండియా చెబుతోందని ఆమె వాపోయింది.

ప్రభుత్వ విమానయాన సంస్థలోనే తనకు ఉద్యోగం రాకుంటే ప్రైవేటు సంస్థల్లో ఎలా వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటర్వూ సందర్భంగా కూడా ఎయిర్ ఇండియా ఉద్యోగులు తనకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదని ఆమె బాధను వ్యక్తం చేసింది. ఇంటర్వూ చేసినంత సేపూ వారేదో తనకు ఇంటర్వూ చేయడం ద్వారా సాయం చేస్తున్నట్లుగానే నటించారని ఆమె పేర్కొంది. ఆ తర్వాత విడుదల చేసిన ఉద్యోగానికి ఎంపికయిన అభ్యర్థుల జాబితాలో తన పేరు కన్పించలేదని, ఇలాగే మూడు పర్యాయాలు జరిగిందని ఆమె తెలిపింది.

ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం కోసం షన్వి మూడేళ్ల కిందట లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. ఎయిరిండియాలో ఉద్యోగానికి అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించినా జెండర్ కారణంగా తనను ఎంపిక చేయలేదని ఆమె పేర్కొంది. ఇదే విషయమై ఆమె సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఆయితే కోర్టు ఖర్చులు భరించలేకపోతున్నానని, తిండికి  కూడా డబ్బులు లేక తిప్పలు పడుతున్నానని, కారుణ్య మరణానికి తనకు అవకాశమివ్వాలని కోరుతూ ఆమె రాష్ట్రపతికి లేఖ రాసింది.

More Telugu News