Drunken Drive: నిరుడు ప్రతి ముగ్గురిలో ఇద్దరు... ఈ సంవత్సరం ప్రతి ఇద్దరిలో ఒకరు... మందుబాబులతో జైళ్లు కిటకిట!

  • డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారితో నిండిపోతున్న జైళ్లు
  • కరుడుగట్టిన నేరస్తులతో కలిపి ఉంచలేక జైలు అధికారుల అవస్థ
  • ప్రత్యేక బ్యారక్ లలో ఉంచి కౌన్సెలింగ్

సాధారణంగా దొంగతనం, దోపిడీ, హత్యలు, అత్యాచారాలు వంటి నేరాలు చేసిన వాళ్లు జైళ్లకు వెళుతుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మత్తు కోసం మందేసి, వాహనం నడుపుతూ డ్రంకెన్ డ్రైవ్ లో పోలీసులకు పట్టుబడితే చాలు... జైలు శిక్ష అనుభవించక తప్పదన్న పరిస్థితి నెలకొంది. జైళ్లలో మందుబాబుల సందడి కనిపిస్తోంది. గత సంవత్సరం జైలుకు వెళ్లిన వారిలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మద్యం తాగి వాహనాలు నడిపిన వారు కాగా, ఈ సంవత్సరం ప్రతి ఇద్దరిలో ఒకరు అదే నేరం చేసి జైలుకు వెళుతున్న పరిస్థితి.

మందుబాబులకు మూడు రోజుల నుంచి వారం వరకూ, తీవ్రమైన కేసుల్లో రెండు నుంచి ఆరు నెలల వరకూ జైలు శిక్షలు పడుతుండగా, వారితో బ్యారక్ లు కిక్కిరిసి పోతున్నాయి. హైదరాబాద్, చంచల్ గూడ జైలు అధికారుల గణాంకాల మేరకు 2017లో మొత్తం 9,650 మంది ఖైదీలు జైల్లో ఉండగా, వారిలో మందుబాబులు 6,511 మంది. ఇక ఈ సంవత్సరం జనవరిలో 1,758 మంది జైలుకు వెళ్లగా, అందులో 920 మంది మందుబాబులే కావడం గమనార్హం.

ఒక్క చంచల్ గూడ జైలు మాత్రమే కాదు. చర్లపల్లి జైల్లోనూ ఇదే పరిస్థితి. చర్లపల్లికి సగటున నెలకు 550 మందికి పైగా డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారు వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక జైళ్లలో ఉండే కరుడుగట్టిన నేరస్తులతో వీరిని రోజుల తరబడి కలిపి ఉంచడం మంచిది కాదని భావించి, వారికి ప్రత్యేక బ్యారక్ లను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. వారికి జైల్లో కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News