Ayodhya: నేటి నుంచి 'రామరాజ్య రథయాత్ర'!

  • అయోధ్య నుంచి యాత్ర మొదలు
  • రెండు నెలల్లో రామేశ్వరానికి
  • కరసేవకపురం నుంచి ప్రారంభం
దేశంలోనే అత్యంత కీలకమైన అయోధ్య రామ జన్మభూమి, బాబ్రీమసీదు కేసు తుది విచారణ సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ తలపెట్టిన 'రామరాజ్య రథయాత్ర' నేడు అయోధ్యలో ప్రారంభం కానుంది. ప్రత్యేకంగా నిర్మించిన రామ రథం, వచ్చే రెండు నెలల వ్యవధిలో ఆరు రాష్ట్రాల్లో పర్యటిస్తూ, తమిళనాడులోని రామేశ్వరంలో యాత్రను ముగించనుంది. అయోధ్యలో రామాలయం నిర్మించాల్సిందేనని 1990లో బీజేపీ నేత ఎల్ కే అద్వానీ రథయాత్రను చేసి, ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తనవంతు కృషి చేసిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, తాము అధికారంలోకి వస్తే, రామజన్మభూమిలో భారీ రామాలయాన్ని నిర్మిస్తామని బీజేపీ వాగ్దానాలిస్తూ, తన మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని చేరుస్తూనే ఉంది. ఇక యూపీలో బీజేపీ ప్రభుత్వం వచ్చి, కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ముద్రపడ్డ యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తరువాత, అయోధ్య రామాలయం ఆ పార్టీకి ప్రధాన ఎజెండాగా మారింది. ఇప్పుడు ఆలయం నిర్మించకుంటే, ప్రజలు నమ్మబోరన్న ఆలోచనలో ఉన్న బీజేపీ, కోర్టులో తీర్పు హిందువులకు, ముస్లింలకు ఆమోదయోగ్యంగా ఉండేలానే ఉంటుందని, వెంటనే రామాలయ నిర్మాణం ప్రారంభమవుతుందని నమ్ముతోంది.

ఇక నేటి రథయాత్ర 1990లో వీహెచ్పీ అయోధ్యలో ఏర్పాటు చేసుకున్న వర్క్ షాప్ కరసేవకపురం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం టాటా మినీ ట్రక్కును అందంగా అలంకరించారు. మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంక్షేమ సంస్థతో పాటు వీహెచ్పీ, వీహెచ్పీ అనుబంధ ముస్లిం రాష్ట్రీయ మంచ్ లు యాత్రను నిర్వహించనున్నాయి. కాగా, కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు ఈ యాత్రతో మరోసారి మత కలహాలు మొదలవుతాయన్న ఆందోళనతో ఉన్నాయి.
Ayodhya
Ram Janmabhoomi
Kerala
Rameshwaram
Ramarajya Radhayatra

More Telugu News