KTR: కేటీఆర్ గారూ.. ఈ వెబ్ సైట్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోండి: కోన వెంకట్

  • మూవీరూల్జ్ వెబ్ సైట్ పై కఠిన చర్యలు తీసుకోండి
  • తెలుగు సినీ పరిశ్రమకు ఈ వెబ్ సైట్ ప్రతిబంధకంగా తయారైంది
  • రిలీజైన ప్రతి సినిమాను ఈ సైట్లో పెడుతున్నారు

కొత్త సినిమా థియేటర్లలో పడిన వెంటనే... దానికి సంబంధించిన పైరసీలు వెబ్ సైట్లలో ప్రత్యక్షం అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలైతే, విడుదలకు ముందే నెట్టింట అడుగుపెడుతున్నాయి. దీంతో, కోట్లాది రూపాయల పెట్టుబడితో సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలు భారీ నష్టాన్ని మూటగట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కు సినీ రచయిత కోన వెంకట్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ విజ్ఞప్తి చేశారు.

'కేటీఆర్ గారూ, మూవీరూల్జ్ (movierulz) వెబ్ సైట్ పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. తెలుగు సినీ పరిశ్రమకు ఈ వెబ్ సైట్ ప్రతిబంధకంగా మారింది. వెబ్ సైట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించండి. సినీ పరిశ్రమకు మంచి చేయండి' అంటూ విన్నవించారు.

రిలీజైన ప్రతి సినిమా ఈ వెబ్ సైట్లో ప్రత్యక్షమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ను కూడా ఆయన పోస్ట్ చేశారు. వెబ్ సైట్లో ఉంచిన కొత్తగా రిలీజైన తెలుగు సినిమాల వివరాలను కేటీఆర్ కు తెలియజేశారు.

More Telugu News