Kotappakonda: ఏపీలో అతిపెద్ద జాతరకు ఏర్పాట్లు పూర్తి!

  • త్రికోటేశ్వరుని మహా శివరాత్రి జాతరకు భారీ ఏర్పాట్లు
  • మేడారం తరువాత తెలుగు రాష్ట్రాల్లో రెండో అతిపెద్ద జాతర
  • రాష్ట్ర పండగగా ప్రకటించిన ఏపీ సర్కారు

ఏపీలో అతిపెద్ద తిరునాళ్లగా పేరున్న కోటప్పకొండ త్రికోటేశ్వరుని మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 13న మహాశివరాత్రి పర్వదినాన్ని కోటప్పకొండలో భారీ ఎత్తున జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో మేడారంలోని సమ్మక్క, సారలమ్మ జాతర తరువాత రెండో అతిపెద్ద జాతర శివరాత్రి నాడు కోటప్పకొండలోనే జరుగుతుంది. రాష్ట్రం విడిపోయిన తరువాత కోటప్పకొండ తిరునాళ్లకు ఏపీ సర్కారు రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది. 

ఇక ఈ తిరునాళ్లలో దాదాపు 100 అడుగులకు పైగా ఎత్తుండే విద్యుత్ ప్రభలు ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రభలను చుట్టుపక్కల గ్రామాల్లో నిర్మించి, శివునికి కానుకగా తెచ్చి త్రికూట పర్వతం ముందు నిలుపుతారు. ఈ ప్రభలను కోటప్పకొండకు తీసుకు వచ్చే మార్గంలో హైటెన్షన్ లైన్లు ఉండటం, వాటి ద్వారా రైళ్లకు విద్యుత్ ను సరఫరా చేస్తుండటంతో, ప్రభల మార్గంపై కొంత సందిగ్ధత ఏర్పడినా, రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకుని, ఆ సమయంలో రైళ్లను డీజిల్ ఇంజన్ లతో నడిపించేందుకు రైల్వే శాఖను ఒప్పించింది.

ఇక శివరాత్రి నాడు అభిషేకానికి రూ. 300, శీఘ్రదర్శనానికి రూ. 150, ప్రత్యేక దర్శనానికి రూ. 75 ధర నిర్ణయించామని, భక్తుల కోసం 1.50 లక్షల లడ్డూలు, 75 వేల అరిసెలను ప్రసాదంగా సిద్ధం చేశామని ఈఓ బైరాగి వెల్లడించారు. 13వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రభుత్వం తరఫున స్పీకర్ కోడెల శివప్రసాద్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని, భక్తుల రద్దీ కారణంగా మూల విరాట్ కు అభిషేకాలను ఆపివేసి, అభిషేక మండపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు.

More Telugu News