Chandrababu: చంద్రబాబు ఇంటి వద్ద న్యాయవాదుల ఆందోళన.. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్!

  • చంద్రబాబును కలిసేందుకు న్యాయవాదుల యత్నం
  • అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. ఉద్రిక్తత
  • రోడ్డుపై బైఠాయించి, నినాదాలు
  • చంద్రబాబు సొంత జిల్లాలో ఏర్పాటు చేసినా ఓకే అన్న అడ్వకేట్లు

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఇంటి వద్ద న్యాయవాదులు ఆందోళనకు దిగారు. శనివారం సాయంత్రం రాయలసీమ ప్రాంత న్యాయవాదులు ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకుని నిరసన తెలిపారు. చంద్రబాబును కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. భద్రతా కారణాల రీత్యా పోలీసులు వారిని అడ్డుకోవడంతో రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్లకార్డులతో న్యాయవాదులు నిరసన తెలిపారు. హైకోర్టును అమరావతిలో నిర్మించొద్దని, రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని నినదించారు.

హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అది సీమవాసుల హక్కని ఈ సందర్భంగా న్యాయవాదులు పేర్కొన్నారు. ఏపీ అంటే ఒక్క అమరావతి, గుంటూరు మాత్రమే కాదని అన్నారు. చంద్రబాబు పుట్టిన జిల్లా అయిన చిత్తూరులో ఏర్పాటు చేసినా తమకు అభ్యంతరం లేదని, కాకపోతే తప్పకుండా రాయలసీమలోనే ఉండాలన్నది తమ డిమాండ్ అని పేర్కొన్నారు. తమ డిమాండ్‌ను పట్టించుకోకుండా అమరావతిలో హైకోర్టును నిర్మిస్తే స్టే తెచ్చి ఆపేస్తామని హెచ్చరించారు.  

  • Loading...

More Telugu News