Hyderabad: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జరుపుతున్న పోలీసులకు చేదు అనుభవం!

  • ట్రాఫిక్ పోలీసులపై దాడికి యత్నించిన యువజంట
  • బ్రీత్ అనలైజర్ పరీక్షలకు సహకరించకుండా చుక్కలు
  • అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు

మద్యం తాగి వాహనాలు నడిపే వారికి కళ్లెం వేసే క్రమంలో పోలీసులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గత రాత్రి హైదరాబాదు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో 7 టీమ్ లు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, ఓ యువజంట తనిఖీలకు సహకరించకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగింది. రాహుల్ సింగ్ అనే యువకుడు బ్రీత్ అనలైజర్ తో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ను దుర్భాషలాడుతూ దాడికి యత్నించాడు.

అతనితో ఉన్న ఓ యువతి, తమను చిత్రీకరిస్తున్న మీడియాపై దాడికి దిగింది. అంకిత్ అనే మరో యువకుడు కూడా పోలీసులపై దాడికి దిగాడు. విషయాన్ని జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించడంతో, వారు వచ్చి ఇద్దరినీ అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద మొత్తం 19 ద్విచక్రవాహనాలు, 19 కార్లు, ఓ ఆటోను సీజ్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులపై దాడికి యత్నించిన వారిపై ఆయా సెక్షన్ల మేరకు కేసులు నమోదు చేయనున్నట్టు తెలిపారు.

More Telugu News