mission bhagiratha: మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం: 15వ ఆర్థిక సంఘం కార్యదర్శి అరవింద్ మెహతా

  • గజ్వేల్ కోమటిబండలో నిర్మించిన భగీరథ హెడ్ వర్క్స్ ను పరిశీలించిన 15వ ఆర్థిక సంఘం కార్యదర్శి
  • తెలంగాణ ఏర్పడిన తర్వాతనే మిషన్ భగీరథ ఆలోచన, ఆచరణ జరిగిందని తెలుసుకుని అరవింద్ మెహత ఆశ్చర్యం
  • దీర్ఘకాలంలో తెలంగాణ సమాజంపై మిషన్ భగీరథ సామాజికంగా, ఆర్థికంగా సానూకూల ప్రభావాన్ని చూపిస్తుందని కితాబు

రాబోయే ఐదేళ్లలో మిషన్ భగీరథతో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు కచ్చితంగా మెరుగవుతాయని, ఇలాంటి భారీ ప్రాజెక్టును ఇంత తక్కువ కాలంలో పూర్తి చేయబోతుండడం ప్రశంసనీయం అని 15వ ఆర్థిక సంఘం కార్యదర్శి అరవింద్ మెహతా అన్నారు. ఇవాళ గజ్వేల్ కోమటిబండలో నిర్మించిన భగీరథ హెడ్ వర్క్స్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే జోషితో కలిసి అరవింద్ మెహత పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన భగీరథ ఫొటో ఎగ్జిబిషన్ ను వీక్షించారు.

ప్రాజెక్టు వివరాలను సురేందర్ రెడ్డి తెలియజేస్తూ, 20 ఏళ్ల కిందట సిద్దిపేటలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రారంభించిన తాగునీటి పథకమే మిషన్ భగీరథకు స్పూర్తి అని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతనే మిషన్ భగీరథ ఆలోచన, ఆచరణ జరిగిందని తెలుసుకుని అరవింద్ మెహత ఆశ్చర్యపోయారు. ఇంతేకాదు 98 శాతం నీటి సరాఫరా గ్రావిటీతోనే జరుగుతుందని తెలుసుకున్న మెహత, తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నారని మెచ్చుకున్నారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అరవింద్ మెహతా..తాగునీటి సమస్యను తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ దేశం మొత్తానికి అనుసరణీయమన్నారు. ఇతర రాష్ట్రాల ఇంజనీర్లు, అధికారులు ఈ ప్రాజెక్టు నుంచి ఎంతో నేర్చుకోవచ్చని చెప్పారు. మనదేశంలో వచ్చే ఎన్నో వ్యాధులకు అపరిశుభ్ర తాగునీరే కారణమని, మిషన్ భగీరథతో తెలంగాణ ప్రజలకు సురక్షిత తాగునీరు హక్కుగా దొరుకుతుందన్నారు.

దీర్ఘకాలంలో తెలంగాణ సమాజంపై మిషన్ భగీరథ సామాజికంగా, ఆర్థికంగా సానూకూల ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరికి రక్షిత మంచినీటిని అందించాలన్న తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్దికి 9 నెలల కాలంలోనే పూర్తైన కోమటిబండ హెడ్ వర్క్స్ పనులే నిదర్శనమన్నారు. ఈ ప్రాజెక్టు కోసం అతి తక్కువ కరెంటును వినియోగించి దేశానికి, తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇంటింటికి మంచినీటితో పాటు ఇంటర్నెట్ ను అందించి తెలంగాణ చరిత్ర సృష్టించబోతుందన్నారు.

ఆ తర్వాత మాట్లాడిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే జోషి, మిషన్ భగీరథ ఇవాళ టాక్ ఆఫ్ ది నేషన్ గా నిలిచిందన్నారు. ఇంటింటికి మంచినీటిని అందించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, RWS&S ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డి, భగీరథ ఎస్.ఈ. చక్రవర్తి, గడా హన్మంతరావు, ఈఈ రాజయ్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

More Telugu News