Narendra Modi: సెలవుకు 'సెలవు' ప్రకటించిన మోదీ.. రెండు దశాబ్దాలుగా నో లీవ్!

  • తన డైరీలో సెలవుకు చోటు లేదన్న మోదీ
  • స్థానిక రుచులను ఆస్వాదించడమే ఇష్టమన్న ప్రధాని
  • రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్ర
  • వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకున్న మోదీ

సెలవు ఎప్పుడొస్తుందా? అని క్యాలెండర్ వైపు చూసేవారు కొందరు, ఎప్పుడు లీవ్ పెడదామా అని కారణం కోసం ఎదురుచూసే వారు మరికొందరు ఉంటారు. కానీ దశాబ్దాలుగా ఆ ఆలోచనే లేని వ్యక్తి ఒకరు ఉన్నారంటే నమ్మగలరా? ఆయన మరెవరో కాదు.. భారత ప్రధాని నరేంద్రమోదీ! గత రెండు దశాబ్దాలుగా ఆయన సెలవన్నదే పెట్టలేదు. గల్ఫ్ దేశాల పర్యటనకు వెళ్లేముందు మీడియాతో మాట్లాడిన మోదీ సెలవుల గురించి గుర్తు చేసుకున్నారు. తనకెప్పుడూ సెలవు పెట్టాలన్న ఆలోచన రాలేదని, పండుగైనా, పబ్బమైనా, ఆప్తులు పిలిచినా, ఆరోగ్యం సహకరించకపోయినా ఎన్నడూ సెలవన్నదే తీసుకోలేదని పేర్కొన్నారు. ‘‘సెలవు పెట్టలేదు.. పని మానలేదు’’ అని వివరించారు.

తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం తిరిగానని పేర్కొన్న మోదీ.. ప్రధాని కాకముందు, అయ్యాక కూడా దేశమంతా పర్యటించానని చెప్పుకొచ్చారు. పర్యటనలో భాగంగా స్థానిక వంటలను కూడా రుచి చూసేవాణ్ణని, ఇవి తనకు నూతనోత్తేజాన్ని ఇచ్చేవని, సెలవు తీసుకోవాలన్న ఆలోచనను రాకుండా అడ్డుకునేవని అన్నారు. తాను విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు వెంట ఎవరూ వంటవారు ఉండరని, అలా తీసుకెళ్లడం తనకు ఇష్టం ఉండదని మోదీ తెలిపారు. స్థానిక వంటకాలను తినడమే తనకు అలవాటని పేర్కొన్నారు.

ఉదయం తాను యోగా చేయడంతోపాటు పేపర్లు చదువుతానని, ఈమెయిల్ చెక్ చేసుకుంటానని మోదీ వివరించారు. అలాగే మోదీ మొబైల్ యాప్‌ను చెక్ చేసి అందులో ప్రజలు సూచించిన  సలహాలు, సూచనలను రాసుకుంటానని తెలిపారు. రాత్రి నిద్రపోయే ముందు మాత్రం కొన్ని ముఖ్యమైన ఫైళ్లు, డాక్యుమెంట్లను పరిశీలిస్తానని, ముఖ్యమైనవి క్లియర్ చేస్తానని వివరించారు. అలాగే మరుసటి రోజు ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటానని చెప్పారు. నాలుగు నుంచి ఆరు గంటల నిద్ర అవసరమని పేర్కొన్న మోదీ తనకు ప్రతీరోజూ ముఖ్యమైనదేనని చెప్పారు.

More Telugu News