Andhra Pradesh: ఆరోగ్యకరమైన రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాల స్థానాలు ఇవి!

  • ఆరోగ్యకరమైన రాష్ట్రాల జాబితా విడుదల చేసిన నీతి ఆయోగ్
  • పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు వేర్వేరుగా జాబితాల విడుదల
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వరుసగా 8,11 స్థానాలు

దేశంలోని ఆరోగ్యకరమైన రాష్ట్రాల జాబితాను నీతి ఆయోగ్ ఈరోజు విడుదల చేసింది. పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు వేర్వేరుగా ఈ జాబితాలను రూపొందించారు. పెద్ద రాష్ట్రాల జాబితాలో   తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లు వరుసగా 8,11 స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో తొలి స్థానాన్ని కేరళ రాష్ట్రం దక్కించుకోగా, మిగిలిన స్థానాల్లో పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఒడిశా రాష్ట్రాలు నిలిచాయి.

ఇక చిన్న రాష్ట్రాల జాబితాలో మిజోరాం మొదటి స్థానంలో నిలవగా, మణిపూర్, మేఘాలయ, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో లక్షద్వీప్ ఆరోగ్యకరమైన ప్రాంతంగా నిలిచింది. కాగా, ఆరోగ్యకరమైన పెద్ద రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్ చివరిస్థానంలో నిలిచినప్పటికీ, అక్కడి ఆరోగ్యపరిస్థితులు కొంత మేరకు మెరుగుపడ్డాయని నీతి ఆయోగ్ పేర్కొంది.

నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్, వరల్డ్ బ్యాంకు (ఇండియా) డైరెక్టర్ జునైద్ అహ్మద్ ఈ జాబితాను విడుదల చేశారు. వరల్డ్ బ్యాంక్ ఇండియా, ఆరోగ్య మంత్రిత్వ శాఖల నుంచి సేకరించిన వివరాల ద్వారా ఈ జాబితాను రూపొందించామని అన్నారు.

More Telugu News