Centre: ఖాళీ ప్రభుత్వ భవనాలను నైట్ షెల్టర్లుగా మార్చండి!: సుప్రీంకోర్టు ఆదేశం

  • పట్టణాల్లో మొత్తం 17.73 లక్షల మంది నిరాశ్రయులు
  • నిరాశ్రయుల పట్ల ప్రభుత్వాల వివక్షపై సుప్రీం ఆగ్రహం
  • పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సానుకూల స్పందన

దేశంలోని దాదాపు 17.73 లక్షల మంది పట్టణ నిరాశ్రయులకు నైట్ షెల్టర్లను ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు గురువారం గట్టిగా మొట్టికాయ వేసింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను నైట్ షెల్టర్లుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించింది. నైట్ షెల్టర్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేసే పనిలేకుండా తాము చేసిన ఈ ప్రతిపాదనను పరిశీలించాలని న్యాయమూర్తులు మదన్ బి లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఇది ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడింది. నిరాశ్రయుల విషయంలో ప్రభుత్వాల వివక్షపై ఆగ్రహం, ఆందోళనను వ్యక్తం చేసింది. నైట్ షెల్టర్ల నిర్మాణంలో అవకతవకలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ఓ కమిటీని నియమించనున్నట్లు తెలిపింది. కోర్టు ప్రతిపాదనకు పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి.

ఇప్పటికే తాము పలు ప్రభుత్వ భవనాలను గుర్తించామని, వాటిని త్వరలోనే నైట్ షెల్టర్లుగా ఉపయోగిస్తామని ఆయా రాష్ట్రాలు వెల్లడించాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో మొత్తం 17.73 లక్షల మంది పట్టణ ప్రాంత నిరాశ్రయులు ఉన్నారు. అందులో 65.3 శాతం మంది యుపి, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం.

మనదేశంలో ప్రతి లక్షమందిలో 146 మందికి ఇళ్లు లేవు. గ్రామీణ భారతావనిలో ప్రతి లక్ష మందిలో 100 మంది, పట్టణ భారతంలో ప్రతి లక్ష మందిలో 249 మందికి గూడు లేదు. కాగా, దేశంలోని పట్టణాల్లో ఇళ్లులేని వారికి ఆశ్రయం కల్పించడం కోసం 2013లో కేంద్ర ప్రభుత్వం జాతీయ పట్టణ జీవనాధార కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. తర్వాత కొన్నేళ్లకు ఆ కార్యక్రమ అమలు కోసం రూ.2000 కోట్లకు పైగా కేటాయింపులు చేసినప్పటికీ, దేశంలో ఇప్పటికీ నిరాశ్రయులకు తిప్పలు తప్పకపోవడం విచారకరం.

More Telugu News