Binu: రౌడీగారి బర్త్ డే పార్టీ... పరారైన వారిలో హీరోయిన్ తమ్ముడు, బిను కనిపిస్తే కాల్చివేతకు ఉత్తర్వులు!

  • బర్త్ డే పార్టీపై దాడి చేసిన పోలీసులు
  • 50 మంది గోడలు దూకి పరారీ
  • ఐదుగురిని హత్య చేయించేందుకే పార్టీ
  • పట్టుబడిన వారిని విచారిస్తున్న పోలీసులు
  • బినుపై షూట్ ఎట్ సైట్ ఆదేశాలు జారీ

చెన్నై శివార్లలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ బిను పాప్పచ్చన్ బర్త్ డే పార్టీపై పోలీసులు దాడి చేసిన వేళ, అక్కడ ఉన్న వారిలో 75 మంది రౌడీలు పట్టుబడగా, మరో 50 మంది వరకూ గోడలు దూకి పరారైన సంగతి తెలిసిందే. పార్టీ జరిగిన ప్రాంతం నుంచి భారీ ఎత్తున మారణాయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాపులు, బెదిరింపులకు పాల్పడుతూ ఎలాంటి నేరం చేసేందుకైనా వెనుకాడని వారంతా, ఇలా ఒకే చోట చేరి పార్టీ చేసుకోవడం ఇదే తొలిసారని పోలీసు వర్గాలు అంటున్నాయి.

ఇక తమకు పట్టుబడిన వారిని విచారించిన పోలీసులు కీలక వివరాలను వెల్లడించారు. పరారైన వారిలో ఓ ప్రముఖ హీరోయిన్ సోదరుడు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారిలో పలువురి వద్ద వివిధ పత్రికల్లో జర్నలిస్టులుగా పని చేస్తున్నట్టు గుర్తింపు కార్డులు, న్యాయవాదులుగా పని చేస్తున్నట్టు తప్పుడు ఐడీలూ ఉన్నాయి. వీరంతా తాము కవరేజ్ కి వచ్చామని, తమ క్లయింట్ పిలిస్తే వచ్చామని చెప్పినా, వినని పోలీసులు, వారి ఐడీలను తనిఖీచేసి నకిలీవని తేల్చారు. పోలీసులకు దొరికిన వారిలో 20 మంది వరకూ కాలేజీ విద్యార్థులు కూడా ఉండటం గమనార్హం.

కాగా, పారిపోయిన బినుపై తమిళ పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్ జారీ అయిందని, తన దందాలకు అడ్డుగా ఉన్నారన్న అనుమానంతో ఐదుగురు రౌడీలను హత్య చేయించేందుకు బిను ఈ పార్టీని ఏర్పాటు చేసి వారిని కూడా పిలిపించాడని పోలీసు అధికారులు తెలిపారు. సమయానికి తాము వెళ్లడంతో ఐదు హత్యలను నివారించగలిగామని అన్నారు. తన పుట్టిన రోజు కోసం ఓ బిల్డర్ ను బెదిరించి రూ. 54 లక్షలు వసూలు చేశాడని అన్నారు. పోలీసుల దాడి తరువాత ఆయన బైక్ పై కేరళ పారిపోయి ఉండవచ్చని భావిస్తున్నామని అన్నారు.

More Telugu News