Donald Trump: మాల్దీవుల రాజకీయ సంక్షోభంపై ఫోన్‌లో మాట్లాడుకున్న మోదీ-ట్రంప్

  • ఈ ఏడాది తొలిసారి మాట్లాడుకున్న మోదీ-ట్రంప్
  • మాల్దీవుల వ్యవహారంతోపాటు పలు అంశాలపై చర్చ
  • వివరాలు వెల్లడించిన వైట్‌హౌస్

మాల్దీవుల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్‌లో చర్చించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఆఫ్ఘనిస్థాన్‌ పరిస్థితిపైనా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతా చర్యలు పెంపుపైనా ఇరువురు నేతలు చర్చించినట్టు శ్వేతసౌధం పేర్కొంది. ‘‘మాల్దీవుల రాజకీయ సంక్షోభంపై ఇరువురు నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు’’ అని వైట్‌హౌస్ పేర్కొంది. మోదీ-ట్రంప్‌లు మాట్లాడుకోవడం ఈ ఏడాది ఇదే తొలిసారి.
 
మాల్దీవుల్లో గత గురువారం రాజకీయ అస్థిర పరిస్థితులు తలెత్తాయి. జైలులో ఉన్న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశంలో ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. వారిని ఉద్దేశపూర్వకంగా జైలులో పెట్టినట్టు అనిపిస్తోందని, బేషరతుగా విడుదల చేయాలన్న సుప్రీం ఆదేశాలను అధ్యక్షుడు యమీన్ తీవ్రంగా వ్యతిరేకించారు.

దేశంలో రెండు వారాలపాటు అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత సుప్రీం చీఫ్ జస్టిస్ అబ్దుల్లా సయీద్, మరో న్యాయమూర్తి అలీ హమీద్‌లను అరెస్ట్ చేయడంతో సంక్షోభం మరింత ముదిరింది. మాల్దీవుల ప్రతిపక్ష నేతలు భారత సాయాన్ని అర్థించారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా, మోదీ-ట్రంప్ చర్చల్లో ఉత్తర కొరియా అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. అలాగే, జూన్, 2017లో వైట్‌హౌస్‌లో మోదీ-ట్రంప్ మధ్య జరిగిన 2+2 చర్చల అంశాన్ని కూడా ఇరు దేశాధినేతలు ప్రస్తావించినట్టు శ్వేతసౌధం వివరించింది.

More Telugu News