Air pollution: వాయు కాలుష్యంతో పెరుగుతున్న నేర, మోస ప్రవృత్తి...!

  • వ్యాకులత పెరుగుదలే కారణమంటున్న పరిశోధకులు
  • ఆరోగ్యంపైనే కాక నైతిక ప్రవర్తనపైనా ప్రభావం
  • వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లోనే నేరాలు ఎక్కువని వెల్లడి

వాయు కాలుష్యం మనుషుల్లో అనైతిక ప్రవర్తనకు దారితీస్తోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. మనదేశంతో పాటు అమెరికాలోనూ చేపట్టిన అధ్యయనం తాలూకూ వివరాలను సైకలాజికల్ సైన్స్‌ జర్నల్‌లో ప్రచురించారు. విపరీతంగా పెరిగే వ్యాకులత మనుషుల్లో ఇలాంటి నేర, మోసపూరిత వైఖరి కలిగేందుకు కొంత వరకు కారణమవుతోందని అమెరికాలోని కొలంబియా బిజినెస్ స్కూల్‌లో బిహేవిరియల్ సైంటిస్టుగా పనిచేస్తున్న జాక్సన్ జి లూ వెల్లడించారు.

"వాయు కాలుష్యం మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వారి నైతిక ప్రవర్తనపై కూడా ప్రభావం చూపుతోందన్న సంగతి మా అధ్యయనంలో తేలింది" అని ఆయన చెప్పారు. వాయు కాలుష్యానికి గురికావడం వల్ల వ్యక్తులు వ్యాకులతకు లోనవడం గుర్తించినట్లు గత అధ్యయనాలు పేర్కొన్నాయి. ఒకానొక అధ్యయనంలో, అమెరికాలోని 9360 పట్టణాల్లో తొమ్మిదేళ్ల పాటు జరిపిన అధ్యయనంలో వాయు కాలుష్యం, నేరాల నివేదికల మధ్య సంబంధాన్ని పరిశోధకులు పరిశీలించారు.

వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో నేరాలు కూడా అధికంగా నమోదవుతున్నట్లు గుర్తించామని వారు తెలిపారు. భారత్‌లో వయోజనులపై అధ్యయనం చేసినపుడు వారు అనైతికమైన సంప్రదింపుల పట్ల సుముఖంగా ఉండటాన్నిగుర్తించామని తాము చేపట్టిన మరో ప్రయోగంలో తేలిందని పరిశోధకులు తెలిపారు.

"వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాక వారి నైతికతను కూడా దెబ్బతీస్తోందని మా పరిశోధనలో వెల్లడయింది" అని జాకన్ చెప్పారు. పలు రకాల టెక్నిక్‌లను ఉపయోగించి తాము చేసిన అధ్యయనంలో శారీరకంగా గానీ లేదా మానసికంగా గానీ వాయు కాలుష్యానికి గురయ్యే వారిలో వ్యాకులత విపరీతంగా పెరగడం వల్ల వారు అనైతిక ప్రవర్తనను కనబరుస్తున్నట్లు గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు.

More Telugu News