Pawan Kalyan: పవన్ కల్యాణ్ కోరి కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు.. మామూలు విషయం కాదు: జేపీ

  • పవన్ ను చూడ్డానికి లక్షలాది మంది డబ్బులిచ్చి వస్తారు
  • కానీ, ఆయన సమాజం కోసం కష్టాల బాటను ఎంచుకున్నారు
  • అందరితో కలసి కార్యాచరణను రూపొందిస్తాం

ఒక టాప్ హీరోగా, కాలు మీద కాలేసుకుని జీవించాల్సిన పవన్ కల్యాణ్ కోరి కష్టాలను కొనితెచ్చుకుంటున్నారని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆయనను చూడటానికి లక్షలాది మంది డబ్బులిచ్చి వస్తారని, కానీ ఆయన మాత్రం ఈ సమాజానికి ఏదో చేయాలన్న తపనతో సవాళ్లతో కూడిన జీవనంలోకి వస్తున్నారని చెప్పారు.

ఏదో రిటైర్మెంట్ వయసులో ఆయన రాజకీయాల్లోకి వచ్చుంటే, అది వేరే సంగతని... కానీ, పవన్ చిన్న వయసులోనే ఈ బాటను ఎంచుకుని, కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారని కితాబిచ్చారు. ఏ సమాజంలో అయితే మనం పెరిగామో, ఆ సమాజానికి ఏదో చేయాలనే బలమైన ఆకాంక్ష ఉంటేనే ఇది సాధ్యమని చెప్పారు. అందుకు వపన్ ను మనసారా అభినందిస్తున్నానని తెలిపారు.

పవన్, తాను ఇద్దరం లోతుగా, మనసు విప్పి మాట్లాడుకున్నామని జేపీ చెప్పారు. రాజకీయ పార్టీల పేరుతో కావచ్చు, పౌర సమాజం పేరుతో కావచ్చు, పత్రికల పేరుతో కావచ్చు... తమలాంటి అభిప్రాయాలు ఉన్నవారు, అధికారమే పరమావధిగా భావించకుండా ఉండే వ్యక్తులంతా ఒకటై... సమాజం కోసం ఏమేం చేయగలమనే విషయంపై చర్చించుకున్నామని తెలిపారు. విభజన హామీలపై మాట్లాడుతూ, ఒకసారి పార్లమెంటులో చర్చించిన తర్వాత, చట్టంలో పెట్టిన తర్వాత హామీలను నెరవేర్చకపోవడం చాలా దారుణమైన విషయమని అన్నారు.

కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు ఏమీ దక్కకపోవడం అన్యాయమని చెప్పారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు కేంద్రం నుంచి అందాల్సినవి చాలా ఉన్నాయని అన్నారు. వీటిని విస్మరిస్తే... ప్రభుత్వాల మీద, పార్టీల మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని చెప్పారు. కొన్నింటిని చట్టంలో పెట్టకపోయినప్పటికీ... సాక్షాత్తు ప్రధాని, హోంమంత్రి పార్లమెంటులో హామీల రూపంలో ఇచ్చారని... ఇప్పుడు చట్టంలో అవి లేవని దాటవేయడం దారుణమని అన్నారు. వీటన్నింటినీ మనం సమీక్షించుకోవాలని చెప్పారు.

అందరితో కూర్చొని ఒక భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుందామని పవన్ ముందడుగు వేశారని... ఇది ఒక మంచి నిర్ణయమని, ఆయన నిర్ణయాన్ని అందరూ అభినందించాలని తెలిపారు. ఇందులో ఎవరూ ఎక్కువ కాదని, దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అని అని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇరు ప్రాంతాల ప్రజల మధ్య అగాథం ఏర్పడిందని... ఇప్పుడిప్పుడే ఇరు ప్రాంత ప్రజల మధ్య సామరస్యం వెల్లివిరుస్తోందని... ఇందుకు ఇరు రాష్ట్ర అధినేతలను అభినందిస్తున్నామని చెప్పారు. 

  • Loading...

More Telugu News