Kashmir: మత్తు పదార్థాలకు బానిసలైన కశ్మీర్ యువతకు ఆర్మీ కౌన్సెలింగ్!

  • బారాముల్లాలోని మైండ్ ట్రీ సెంటర్‌లో సదస్సు
  • కుటుంబాలు, మిత్రుల పాత్ర అవసరమని సూచన
  • కశ్మీర్‌లో డ్రగ్స్‌పై పోరాటం కొనసాగుతుందని ఆర్మీ ప్రకటన

అందమైన కశ్మీర్ లోయలో మత్తుపదార్థాలకు బానిసలైన యువతకు భారత ఆర్మీ కౌన్సెలింగ్ ఇచ్చింది. ఇప్పటివరకు ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత సైన్యం డ్రగ్స్‌కు అలవాటైన యువకులను తిరిగి మామూలు మనుషులుగా చేయడానికి సంకల్పించుకుంది. మాదకద్రవ్య సేవనం కశ్మీర్‌ లోయలో అతిపెద్ద సమస్యగా మారిపోయింది. వేలాది మంది స్థానిక యువకులు ఈ మహమ్మారి వలలో చిక్కుకుపోయారు.

ఈ నేపథ్యంలో వారిని కాపాడే దిశగా భారత సైన్యం "మానసిక, శారీరక ఆరోగ్యం, సమాజంపై మాదకద్రవ్యాల ప్రమాదకర ప్రభావం, ఒక వ్యసనపరుడి లక్షణాలను గుర్తించడం, అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రతలు" అనే అంశంపై బారాముల్లాలోని మైండ్ ట్రీ కోచింగ్ సెంటర్‌లో ఒక సదస్సును నిర్వహించిందని ఆర్మీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదకరమైన, అంతిమ దుష్ప్రభావాల గురించి కౌన్సెలర్లు యువతకు వివరించారు. చివరగా, డ్రగ్స్ వ్యసనం మన దేశ యువతను ఏ రకంగా దెబ్బతీస్తున్నదీ, వారి జీవితం చివరకు ఎలా అంధకారంలో చిక్కుకుపోతోందనే విషయాలను కూడా కౌన్సెలర్లు చక్కగా వివరించారని ఆయన తెలిపారు. కశ్మీర్ లోయలో డ్రగ్స్ భూతంపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

డ్రగ్స్ వ్యసనం నుండి బయటపడటానికి చేసే పోరాటంలో బాధితులకు వారి కుటుంబాలు, మిత్రుల పాత్రను కూడా వారు వివరించారు. కాగా, 2008 నుంచి పోలీసుల డీ-అడిక్షన్ కేంద్రంలో దాదాపు పదివేలకు పైగా డ్రగ్ వినియోగదారులకు చికిత్స అందించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నేరం కింద పోలీసులు గతేడాది 888 కేసులు నమోదు చేసి 1213 మందిని అరెస్టు చేశారు.

More Telugu News