Call centre: అమెరికన్లను బెదిరించిన పూణె బోగస్ కాల్‌సెంటర్‌పై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్ట్!

  • 500 నుంచి 1000 డాలర్లు చెల్లించాలంటూ బ్లాక్‌మెయిల్
  • కేసు దర్యాప్తుకు అమెరికా సంస్థల సహకారం
  • మరో రెండు బోగస్ కాల్ సెంటర్ల గుర్తింపు...దర్యాప్తు ముమ్మరం

పన్ను ఎగవేతకు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని సుమారు 11 వేల మందికి పైగా అమెరికా పౌరులను బెదిరించి మోసానికి పాల్పడినట్లు అనుమానించిన పూణెలోని ఓ బోగస్ కాల్‌సెంటర్‌పై స్థానిక పోలీసులు దాడులు చేశారు. ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తుకు పూణె పోలీసు విభాగానికి చెందిన ఆర్థిక, సైబర్ నేరాల విభాగానికి అమెరికా ప్రభుత్వ ఇంటర్నల్ రెవిన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్), ఫెడరల్ ట్రేడ్ కమీషన్ (ఎఫ్‌టిసి) తమ వంతు సహకారాన్ని అందించాయి.

దాడుల సందర్భంగా, దేశంలో మరో రెండు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇలాంటి రెండు కాల్ సెంటర్ల వివరాలను కూడా సేకరించామని పోలీసులు తెలిపారు. అయితే అవి ఎక్కడ ఉన్నాయి? వాటిని నడిపిస్తున్న వ్యక్తులెవరనే వివరాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని వారు చెప్పారు. మొత్తం ఈ మూడు కేసుల పురోగతిని అమెరికా సంస్థలు పర్యవేక్షిస్తున్నాయి.

అమెరికన్ల నుండి ఈ బోగస్ కాల్ సెంటర్ మోసపూరితంగా ఎంత మొత్తాన్ని వసూలు చేసిందనే విషయంతో పాటు అరెస్టయిన ముగ్గురి బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు గురించి డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ హిరిమత్ మాట్లాడుతూ...ఈ కేసుల దర్యాప్తుకు అమెరికాకి చెందిన ఐఆర్ఎస్, ఎఫ్‌టిసిలు తమ వంతు సహకారాన్ని అందివ్వడానికి నిర్ణయించుకున్నాయని ఆయన చెప్పారు.

అమెరికన్ పౌరులను బెదిరించడానికి నిందితులు ఆ దేశంలోని కొన్ని సంస్థల పేర్లను వాడినట్లు ఆయన తెలిపారు. పన్నులు ఎగవేసిన కేసులో ఐఆర్ఎస్ చేతికి దొరికితే కఠిన శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిందితులు అమెరికన్లను బెదిరించడంతో పాటు వారిని 500 డాలర్ల నుండి వెయ్యి డాలర్ల వరకు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News