mudragada padmanabham: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ కు ముద్రగడ విన్నపం!

  • ఓటు ఉన్నా తమ హక్కును వినియోగించుకోలేకపోతున్నారు
  • లిస్టులో పేరు లేదని పోలింగ్ సిబ్బంది వెనక్కి పంపుతున్నారు
  • ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి

సామాన్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. ఓటరు లిస్టులో పేరు ఉన్నా, ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కు వెళ్లినవారికి... లిస్టులో పేరు లేదంటూ సిబ్బంది చెబుతుంటారని ఆయన అన్నారు. పోలింగ్ అధికారులకు కరెంట్ బిల్లు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇంటి పన్ను రసీదు, రేషన్ కార్డు వగైరా ఆధారాలు చూపించినా ఫలితం ఉండటం లేదని చెప్పారు.

ఈ విషయాన్ని ఆయన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓమ్ ప్రకాశ్ రావత్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఉన్నప్పటికీ, దీన్ని సరిదిద్దలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించలేకపోతే భారత దేశంలో పుట్టిన తమకు ఇక్కడ ఓటు వేసే హక్కు కూడా లేదా? అని యువత వాపోయే పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. సరైన విచారణ జరపకుండా, ఓటును తొలగించే పద్ధతి మంచిది కాదని చెప్పారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేలా సరైన చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

More Telugu News