galla jayadev: 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్' అంటూ... లోక్ సభలో బీజేపీని ఏకిపారేసిన గల్లా జయదేవ్!

  • మోదీ, జైట్లీలపై విరుచుకుపడ్డ జయదేవ్
  • ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదు
  • దేశంలోనే పెద్ద అవినీతిపరుడు జగన్ కు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా?
  • మీ చేతిలో మోసపోయామని భాగస్వామ్యపక్షాలు భావిస్తున్నాయి
  • లోక్ సభలో ఎక్కువ సంఖ్యాబలం ఉందని భావించవద్దు.. పరిస్థితులు వేగంగా మారుతున్నాయ్
  • ప్రజలు అన్నీ గమనిస్తున్నారు

లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నిన్న విశ్వరూపం చూపించారు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్... లోక్ సభ వేదిక నుంచి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా... విభజన హామీలన్నీ నెరవేరుస్తామన్న మీరు, వాటిని ఎందుకు అమలు చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉందంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు. 14 నిమిషాల పాటు ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించిన ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు.

ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నా, ఏపీకి మీరు చేసింది ఏమిటని సూటిగా ప్రశ్నించారు. 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీ సంకీర్ణ భాగస్వాములకు మీరు ఎలాంటి సందేశాన్ని పంపాలనుకుంటున్నారు?' అంటూ నిలదీశారు. మీ చేతిలో మోసపోతున్నామని, అవమానాలకు గురవుతున్నామని భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నాయని చెప్పారు. ఐదు కోట్ల మంది ఏపీ ప్రజల్లో కూడా ఇదే భావన ఉందని స్పష్టం చేశారు. నిన్న లోక్ సభలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు నిప్పులు చెరిగారు.

టీడీపీని బలహీనపరచడం ద్వారా బీజేపీ బలపడవచ్చని... మీకు మీ పార్టీ నేతలు తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చని... వాటిని మీరు నమ్మితే మొదటికే మోసం వస్తుందని జయదేవ్ అన్నారు. ఏపీ ప్రజలను మోసగించడం ద్వారా తెలంగాణలో లబ్ధి పొందవచ్చని కాంగ్రెస్ పార్టీ భావించిందని... ఇదే సమయంలో వైసీపీతో జట్టు కట్టి ఏపీలోనూ లాభం పొందవచ్చని అంచనా వేసిందని... కానీ, ఆ పార్టీ ఏపీలో భూస్థాపితమయిందని చెప్పారు. ఇలాంటి వ్యూహాలనే అమలు చేయాలని భావిస్తే, బీజేపీకి కూడా అదే పరిస్థితి వస్తుందని అన్నారు. తప్పుడు వ్యూహాలను పాటిస్తే బీజేపీకి భంగపాటు తప్పదని హెచ్చరించారు.

వైసీపీ నేతలు కేంద్ర బడ్జెట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారని... బీజేపీతో కలిసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని... కేంద్రం చేసిన అన్యాయానికి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని గల్లా అన్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి భజన చేయడం వైసీపీ నైజమని చెప్పారు. వారి పార్టీ నేత జగన్ జైలుకు వెళ్లకుండా ఉండాలంటే, వారికి అంతకు మించిన దారి మరొకటి లేదని తెలిపారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన వ్యక్తికి సంబంధించిన పార్టీకి మద్దతు ఇవ్వాలనుకోవడం ద్వారా... దేశ ప్రజలకు బీజేపీ ఎలాంటి సందేశం పంపించాలని అనుకుంటోందని ప్రశ్నించారు. ఏపీలో టీడీపీకన్నా మెరుగైన భాగస్వామ్యపక్షంగా వైసీపీ ఉంటుందని భావిస్తున్నారా? అని నిలదీశారు.

తమ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నాలుగేళ్లలో ఢిల్లీకి 29 సార్లు వచ్చి ప్రధానిని, ఇతర కేబినెట్ మంత్రులను కలిశారని, రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతూ సమగ్ర నివేదికలు అందించారని... అయినా, వాటన్నింటినీ బుట్టదాఖలు చేశారని గల్లా మండిపడ్డారు. సాంకేతిక సమస్యల కారణంగా ప్రత్యేక హోదా కుదరదని మీరు చెబితేనే, తాము ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని చెప్పారు. రెండింటికీ తేడా లేకుండా అవసరమైనన్ని నిధులను ఇస్తామని ప్రధాని హామీ ఇస్తేనే తాము ప్యాకేజీకి ఒప్పుకున్నామని తెలిపారు.

మిత్రపక్షాలుగా కలసి ఎన్నికలకు వెళ్లాం కాబట్టే... నాలుగు బడ్జెట్ ల నుంచి వేచి చూస్తున్నామని చెప్పారు. ఇకపై ఆ అవకాశం లేదని... ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ అని, ఇప్పుడు మీరు ఏమీ చేయలేకపోతే మాకు అన్యాయం చేసినవారు అవుతారని తెలిపారు. లోక్ సభలో మీకు సంఖ్యాబలం ఎక్కువగా ఉందనే భావనలో మీరు ఉన్నారని... అయితే వేగంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో, రానున్న రోజుల్లో ఏదైనా జరుగుతుందని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చక పోతే ప్రజలు చూస్తూ ఊరుకోబోరని అన్నారు.

More Telugu News