China: భారత్‌కు కౌంటర్.. మాల్దీవుల వ్యవహారంలో జోక్యం చేసుకోబోమన్న చైనా

  • సమస్య పరిష్కారానికి కృషి చేయాలి తప్పితే చర్యలు వద్దు
  • మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని అందరూ గౌరవించాలి
  • చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ

మాల్దీవుల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం విషయంలో తాము జోక్యం చేసుకోబోమని డ్రాగన్ కంట్రీ చైనా తేల్చి చెప్పింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ఆ దేశ ప్రతిపక్ష నేతలు భారత్ సాయాన్ని అర్థించిన నేపథ్యంలో చైనా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

‘‘మాల్దీవుల్లో నెలకొన్న సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు అంతర్జాతీయ సమాజం నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలి. ఆ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి. అంతేతప్ప ఆవేశపడి చర్యలు తీసుకోవడం వల్ల సమస్య మరింత జటిలమవుతుంది’’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ భారత్ పేరెత్తకుండా పేర్కొన్నారు.

మాల్దీవుల మాజీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మొహమ్మద్ నషీద్ మంగళవారం ట్వీట్ చేస్తూ.. దేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితులను చక్కదిద్దేందుకు భారత్ జోక్యం చేసుకోవాలని కోరారు. అధ్యక్షుడు అరెస్ట్ చేయించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, రాజకీయ నేతలను విడిపించేందుకు మిలటరీ తోడుగా దౌత్యవేత్తలను పంపాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. అయితే భారత్ నుంచి ఇప్పటి వరకు ఈ విషయంలో ఎటువంటి ప్రకటన లేదు. మరోవైపు ఇదే విషయంపై చైనా స్పందిస్తూ తామైతే మాల్దీవుల వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది.

  • Loading...

More Telugu News