Kim jong: దక్షిణకొరియా ఒలింపిక్స్‌కు కిమ్ సోదరి హాజరు!

  • దక్షిణకొరియాలో శీతాకాల ఒలింపిక్స్‌ నిర్వహణ
  • కిమ్ ఫ్యామిలీ దక్షిణ కొరియా వెళ్లడం ఇదే ప్రథమం
  • దక్షిణకొరియాకి ఉత్తరకొరియా ప్రతినిధుల బృందం

ఉత్తరకొరియా, దక్షిణకొరియాల మధ్య సత్సంబంధాలు లేక చాలా ఏళ్లవుతోంది. కానీ, ఈ మధ్యకాలంలో ఇరు దేశాల మధ్య కుదిరిన సయోధ్య కారణంగా దక్షిణ కొరియాలో నిర్వహించనున్న శీతాకాల ఒలింపిక్స్ కోసం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో-జోంగ్ వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చల తర్వాత ఉత్తర కొరియా తమ క్రీడాకారులను అక్కడికి పంపడానికి అంగీకరించింది. దక్షిణకొరియాలో ఒలింపిక్ క్రీడలకు వెళ్లే ఉత్తరకొరియా ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందంలో కిమ్ సోదరి కూడా ఉన్నారు.

కిమ్ కుటుంబం ఇలా దక్షిణ కొరియా వెళ్లడం ఇదే మొదటిసారి. కాగా, కిమ్ జోంగ్ తన సోదరికి గత అక్టోబరులో వర్కర్స్ పార్టీలో కీలక పదవిని కట్టబెట్టారు. పార్టీ కార్యకలాపాల్లో ఆమె తరచూ ఆయనతో కలిసి పాల్గొంటుండేవారు. అయితే ఉత్తరకొరియాలో మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెను అమెరికా ప్రభుత్వం నిషేధిత జాబితాలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, దక్షిణకొరియాలో ఈ ఒలింపిక్ క్రీడలు శుక్రవారం నుండి మొదలుకానున్నాయి.

More Telugu News