MS Dhoni: ధోనీ స్ట్రేటజీ.. నెట్స్ లో ఎక్కువ సేపు గడిపిన మాజీ కెప్టెన్!

  • ఎక్కువ సేపు నెట్ ప్రాక్టీసు చేసిన మాజీ కెప్టన్
  • కేప్‌టౌన్ గ్రౌండ్‌లో సఫారీలకు ఘనమైన రికార్డు
  • స్థానికుల కోసం నీటిని పొదుపు చేస్తామన్న థావన్

ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లో యువ స్పిన్నర్లతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను ఓడించిన టీమిండియా మరి కాసేపట్లో కేప్‌టౌన్‌లో జరగనున్న మూడో వన్డేకి సిద్ధమవుతోంది. గతంలో సక్సెస్‌ఫుల్ కెప్టెన్ గా పేరుతెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ ఈ మ్యాచ్‌ కోసం ఏదో ప్లాన్ వేసుకున్నట్లు మంగళవారం అతను ఎక్కువ సేపు చేసిన నెట్ ప్రాక్టీసును బట్టి అర్థమవుతోంది.

వికెట్‌ని కాపాడుకుంటూ తను నెట్స్‌లో చాలాసేపు గడపాడు. సాధారణంగా అతను నెట్స్‌లో ఎక్కువ సేపు ప్రాక్టీసు చేయడు. కానీ, నెమ్మదిగా పడుతున్న బంతులను ఎదుర్కోవడంపై ఈ మాజీ కెప్టెన్ శ్రద్ధ చూపించాడు. మరోవైపు ఈ సిరీస్‌లో ఇప్పటివరకు చాహల్, కుల్‌దీప్ లాంటి భారత యువ స్పిన్నర్ల ధాటికి విలవిలలాడిపోయిన సఫారీలు ఈ సిరీస్‌లో తిరిగి గాడిలో పడాలంటే ఈ స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడమే తారకమంత్రమని గ్రహించినట్లు తెలుస్తోంది.

ఈ మైదానం సఫారీలకు అచ్చొచ్చినది కావడంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా ఉండబోతోందని తెలుస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ డాలే బెంకెన్‌స్టీన్ డిఫెండింగ్ సరిపోదని... పరుగులు జోడించి భారీ స్కోరు చేయాలని సఫారీలకు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే... నీటి సంక్షోభం కేప్‌టౌన్‌ను ఇబ్బంది పెడుతోంది.

టీమిండియా ప్లేయర్ శిఖర్ థావన్ మాట్లాడుతూ...సాధ్యమైనంత నీటిని తాము పొదుపు చేయాలన్న సంగతి తమకు అర్థమైందన్నాడు. ఇలా చేయడం వల్ల స్థానికులకు ఆ నీరు ఉపయోగపడుతుందని, ఇలా చేయడం గౌరవప్రదమైన విషయంగా తాము భావిస్తామని అతను చెప్పాడు. భారత కాలమానం ప్రకారం, ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది.

More Telugu News