Budjet: రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు దక్కిందిదే!

  • సాధారణ బడ్జెట్ లో మొండిచెయ్యి
  • రైల్వే బడ్జెట్ లోనూ అంతంతమాత్రమే
  • అమరావతి - గుంటూరు లైన్ కు రూ. 3,272 కోట్లు మాత్రమే
  • నడికుడి - శ్రీకాళహస్తి మార్గానికి రూ. 420 కోట్లు

సాధారణ బడ్జెట్ లో ఏపీకి మొండిచెయ్యి చూపించిన కేంద్రం, రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లోనూ అదే పని చేసింది. పాత మార్గాలకు అరకొర నిధులు తప్ప, కొత్త మార్గాలను ప్రకటించలేదు. అమరావతికి అత్యంత కీలకమైన రైల్వే లైన్, విజయవాడ - గుంటూరు వయా అమరావతికి రూ. 3,272 కోట్ల అంచనా వ్యయం కాగా, బడ్జెట్ లో కేవలం రూ. 10 కోట్లు విదిల్చారు.

ఇక ఈ ప్రాజెక్టు లాభసాటి కాదని భావిస్తున్నామని, నిర్మాణ వ్యయంలో కొంత మొత్తాన్ని రాష్ట్రం భరించాలని రైల్వే శాఖ కోరింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం, పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదని స్పష్టం చేయడంతో, ఈ మార్గం ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవు. ఇక ఒక్క కొత్త మార్గాన్నీ మంజూరు చేయని కేంద్రం, గతంలో సర్వేలు పూర్తి చేసిన కొత్త లైన్లపైనా ఒక్క మాట మాట్లాడలేదు.

 హైదరాబాద్ నుంచి చెన్నైకి దూరాన్ని తగ్గించే నడికుడి - శ్రీకాళహస్తి మార్గానికి రూ. 420 కోట్లను కేటాయిస్తున్నట్టు పేర్కొంది. ఈ మార్గంలో పిడుగురాళ్ల నుంచి రొంపిచర్ల వరకూ 28 కిలోమీటర్ల దూరాన్ని ఈ సంవత్సరంలో అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ఓబులవారి పల్లి - కృష్ణపట్నం, విజయవాడ - గూడూరు మూడోలైన్ కు కొంతమేరకు కేటాయింపులు జరిగాయి.

మొత్తం మీద 2017-18లో ఇచ్చిన నిధులతో పోలిస్తే, ఈ సంవత్సరం 8 శాతం అదనపు కేటాయింపులు జరిపినప్పటికీ, కొత్త లైన్లు, రైళ్లు లేకపోవడం, డిమాండ్ మేరకు ఫ్రీక్వెన్సీ పెంపు వంటి నిర్ణయాలు వెలువడకపోవడం నిరాశ కలిగిస్తోంది.

More Telugu News