Andhra Pradesh: కదులుతున్న డొంక... వెలగపూడి, తుళ్లూరు, రాయపూడి గ్రామాల వాసులుగా టీడీపీ నేతలు!

  • స్వచ్ఛందంగా 36 వేల ఎకరాలకు పైగా ఇచ్చిన రైతులు
  • చేతివాటం చూపిన అధికారులు
  • భూమి ఇవ్వని వారి పేర్లు చేర్చి మాయాజాలం
  • సీబీఐ దర్యాఫ్తునకు వైకాపా డిమాండ్
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి పిలుపును అందుకుని, ఎటువంటి అడ్డంకులూ చెప్పకుండా దాదాపు 36 వేల ఎకరాలకు పైగా తమ భూములను రైతులు ఉదారంగా రాజధాని అమరావతి నిర్మాణానికి ఇస్తే, సీఆర్డీయే అధికారులు తమ చేతి వాటం చూపి, ప్రభుత్వానికి, రైతులకు భారీ నష్టాన్ని తెచ్చారు. అసలు భూమి ఇవ్వని పలువురి పేర్లను భూములు ఇచ్చినవారి జాబితాలో చూపి, వారికి అమరావతిలో రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఇచ్చేలా అధికారులు మాయాజాలాన్ని ప్రదర్శించారన్న సంచలన వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది.

గౌస్ ఖాన్ వ్యవహారంలో తీగ లాగితే, ఇప్పుడు పెద్ద డొంకే కదిలేలా ఉంది. పలువురు తెలుగుదేశం నేతల పేర్లను వెలగపూడి, తుళ్లూరు, రాయపూడి, మందడం వాసులుగా సీఆర్డీయే అధికారులు ధ్రువీకరించారని, వారు భూములు ఇవ్వకున్నా, ఇచ్చినట్టు రికార్డులను తారుమారు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నివేదికను ఇప్పటికే కోరగా, ఇదంతా ప్రభుత్వం కుట్రేనని, రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వైకాపా, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. గతంలోనూ సీఆర్డీయే అధికారులపై పలు ఆరోపణలు రాగా, ఇప్పుడు సాక్ష్యాలు కూడా లభ్యం అవుతుండటం కలకలం రేపుతోంది. ఈ కుంభకోణంపై, మొత్తం ల్యాండ్ పూలింగ్ పై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Andhra Pradesh
Amaravati
Tulluru
Mandadam
Velagapudi
YSRCP
Telugudesam

More Telugu News