సంజయ్ మంజ్రేకర్‌పై కోహ్లీ ఫ్యాన్స్‌ ఫైర్‌.. మరోపక్క పాక్ అభిమానుల ఆగ్రహం!

06-02-2018 Tue 10:14
  • బెస్ట్ కెప్టెన్ నామినీలను ప్రతిపాదించిన క్రిక్ ఇన్ఫో
  • కోహ్లీని కాదని పాక్ కెప్టెన్ కు ఓటు వేస్తానన్న మంజ్రేకర్
  • పాక్ అండర్ డాగ్ అంటూ కామెంట్
2017 సంవత్సరానికి గాను ఉత్తమ కెప్టెన్ అవార్డులకు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో నామినీలను ప్రకటించింది. నామినీల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ అస్గర్ స్టానిక్ జై, టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, ఇంగ్లండ్ మహిళా టీమ్ కెప్టెన్ హీథర్ నైట్ పేర్లను క్రిక్ ఇన్ఫో ప్రతిపాదించింది.

దీనిపై టీమిండియా మాజీ ప్లేయర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ, తాను సర్ఫరాజ్ అహ్మద్ కే ఓటు వేస్తానని చెప్పాడు. కష్టకాలంలో సర్ఫరాజ్ కెప్టెన్సీ పాక్ జట్టుకు ఎంతో తోడ్పాటును అందించిందని అన్నాడు. విదేశాల్లో ఆడే సమయంలో తడబాటుకు గురయ్యే పాక్ జట్టును సర్ఫరాజ్ విజయతీరాలకు చేర్చాడని కొనియాడాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని తన దేశానికి అందించడమే కాకుండా, ఎక్కువ మ్యాచ్ లను గెలిపించిన ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్నాడని చెప్పాడు. మిగిలిన కెప్టెన్ ల కంటే సర్ఫరాజ్ కష్టమే తనకు ఎక్కువగా కనిపిస్తోందని తెలిపాడు. ఈ నేపథ్యంలో, అండర్ డాగ్ అయిన పాక్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ కే తన ఓటు అని స్పష్టం చేశాడు.

మరోవైపు, మంజ్రేకర్ వ్యాఖ్యలపై కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. కోహ్లీని కాదని దాయాది జట్టు కెప్టెన్ కు ఎలా ఓటు వేస్తావంటూ నిలదీస్తున్నారు. 'ఆటగాడిగా, కామెంటేటర్ గా విఫలమైన నీవు... ఇప్పుడు దేశభక్తుడిగా కూడా విఫలమయ్యావ్' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, పాక్ అభిమానులు సైతం మంజ్రేకర్ పై మండిపడుతున్నారు. పాక్ ను అండర్ డాగ్ అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మూడు ఐసీసీ టోర్నమెంట్ లను గెలుచుకున్న పాక్ ను అండర్ డాగ్ అని సంబోధించడాన్ని తప్పుబడుతున్నారు.