Tajmahal: త్వరలోనే 'తేజ్ మందిర్‌'గా తాజ్‌మహల్‌!: బీజేపీ ఎంపీ వినయ్ కతియార్

  • తాజ్ మహోత్సవ్ లేదా తేజ్ మహోత్సవ్.. రెండింటికి పెద్ద తేడా లేదు
  • తేజ్ మందిర్‌ను ఔరంగజేబు దహనవాటికగా మార్చారు
  • బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యలు

అధికార బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ తాజ్ మహల్‌ను త్వరలోనే తేజ్ మందిర్‌గా మారుస్తామంటూ సోమవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆగ్రాలో నిర్వహించనున్న "తాజ్ మహోత్సవ్" గురించి ఎఎన్‌ఐ వార్తా సంస్థ ప్రతినిధి పలకరించినపుడు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. 'తాజ్ మహోత్సవ్ లేదా తేజ్ మహోత్సవ్...ఎలా పిలిచినా ఒకటే. ఈ రెంటి మధ్య పెద్ద తేడా లేద'ని ఆయన పేర్కొన్నారు.

తేజ్ మందిర్‌ను ఔరంగజేబు ఒక దహన వాటికగా మార్చారని ఆయన ఆరోపించారు. అందువల్ల తాజ్ మహల్‌ను త్వరలోనే తేజ్ మందిర్‌గా మారుస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతమున్న తాజ్ మహల్ ఔరంగజేబు పాలిస్తున్న సమయంలో ఉన్నది కాదని, ఇది తమ దేవాలయమని ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవానికి తాజ్ మహల్ అనేది ఒక శివుడి ఆలయమని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో అక్కడ శివలింగాన్ని కూడా ఏర్పాటు చేశారని, కానీ, దానిని తొలగించారని, అంతేకాక అది హిందువుల దేవాలయమేనని చెప్పడానికి ఇంకా పలు ఇతర నిదర్శనాలు కూడా ఉన్నాయని ఆయన వివరించారు.

కాగా, ఆగ్రాలో ఈ నెల 18 నుంచి పది రోజుల పాటు తాజ్ మహోత్సవ్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, గవర్నర్ రామ్ నాయక్‌ హాజరుకానున్నారు. మరోవైపు ఈ కార్యక్రమాన్ని యోగి ప్రభుత్వం కాషాయీకరిస్తోందని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.

More Telugu News