Narendra Modi: నరేంద్ర మోదీ ముందు 'పకోడీ' నిరసన... పది మంది అరెస్ట్!

  • బెంగళూరులో మోదీ ఎన్నికల ప్రచారం
  • బయట పకోడీలు అమ్మిన విద్యార్థులు
  • న్యూసెన్స్ కేసు పెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు
  • గతంలో పకోడీలు అమ్మినా ఉద్యోగులేనన్న మోదీ

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, పరివర్తన్ యాత్ర పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించగా, అక్కడ వినూత్న నిరసన తెలిపిన పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో మోదీ, పకోడీలను అమ్మడం కూడా ఉద్యోగమేనని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, మోదీ సభ జరుగుతున్న ప్యాలెస్ గ్రౌండ్ పక్కనే పకోడీల అమ్మకాన్ని ప్రారంభించారు. స్నాతకోత్సవ దుస్తులను ధరించిన యువతీ యువకులు, సభ జరుగుతున్న ప్రాంతం బయట రోడ్డుపై పకోడీలు అమ్మారు.

బస్సుల వద్దకు, వాహనదారుల వద్దకు వెళ్లి, 'మోదీ పకోడీలు, అమిత్ షా పకోడీలు, యడ్యూరప్ప పకోడీలు' అంటూ వాటిని విక్రయించారు. ఉద్యోగాలను సృష్టించలేని ప్రభుత్వ నేతలు పకోడీలను అమ్ముకోవడమే పనిగా పెట్టుకోవాలని సలహాలు ఇస్తున్నారని ఈ సందర్భంగా వారు విమర్శించారు. ఇక ఈ విషయమై న్యూసెన్స్ కేసు నమోదు చేసిన పోలీసులు, పది మందిని అరెస్ట్ చేశారు.

ఇదే సమయంలో మోదీ రాకను నిరసిస్తూ, సిటీ సెంటర్ సమీపంలోని ఫ్రీడమ్ పార్క్ లో ప్రదర్శనకు దిగిన కన్నడ అనుకూల సంఘాలకు చెందిన 100 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇటీవల ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన మోదీ, ఓ పకోడీ షాప్ పెట్టుకుని ఎవరైనా రోజుకు 200 సంపాదిస్తుంటే వారిని నిరుద్యోగిగా భావించలేమని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు విమర్శల వర్షం కురిపించారు. చాయ్ అమ్మిన వ్యక్తి, ఇప్పుడు దేశానికి ప్రధానిగా మారి, యువతను పకోడీల వ్యాపారానికి ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More Telugu News