Hyderabad: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఎన్నారై యువకుల హంగామా... రెండు గంటల పాటు నానాయాగీ!

  • మందు కొట్టి పట్టుబడిన ఎన్నారై యువకులు
  • కారులో మద్యం సీసాలు, హుక్కా
  • తనిఖీలకు సహకరించకుండా రెండు గంటల పాటు గొడవ

గత రాత్రి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు తనిఖీలు చేస్తున్న వేళ, ఆ దారిలో వచ్చిన కొందరు ఎన్నారై యువకులు నానా హంగామా చేశారు. తనిఖీలకు సహకరించకుండా పోలీసులతో గొడవకు దిగారు. ట్రాఫిక్ సీఐ, కానిస్టేబుల్ లను దూషించారు. దాదాపు రెండు గంటల పాటు నడిరోడ్డుపై నానాయాగీ చేశారు. వారు ప్రయాణిస్తున్న కారులో మద్యం సీసాలు, హుక్కా లభ్యం కావడంతో పోలీసులు కూడా పరీక్షలు చేసేంత వరకూ పట్టుగానే ఉన్నారు.

డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడితే తిరిగి విదేశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని యువకులు వాదించగా, నిబంధనలు ఎవరికైనా ఒకటేనని పోలీసులు హెచ్చరించారు. ఇక ఫిల్మ్ నగర్ తనిఖీల్లో 9 టూవీలర్లు, 7 కార్లు పట్టుబడగా, మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశామని, వారికి కౌన్సెలింగ్ నిర్వహించి న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతామని తెలిపారు.

More Telugu News