somu veerraju: లోకేష్ కు 19 అవార్డులు రావడానికి కారణం ఎవరు? రాయపాటిలాంటి వాళ్లు కూడా మాట్లాడతారా?: సోము వీర్రాజు

  • పొగాకులో రాళ్లుపెట్టి చైనాకు అమ్మిన చరిత్ర రాయపాటిది
  • రాయపాటిలాంటివారు కూడా మోదీని విమర్శిస్తారా?
  • లోకేష్ అవార్డులకు కేంద్ర నిధులే కారణం

పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఇచ్చిన నిధుల్లో ఎంతమేర పనులు జరిగాయని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పజెప్పేస్తామని ప్రకటించిన చంద్రబాబు... ఇప్పుడు మరో కంపెనీని తెరపైకి ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. బడ్జెట్ పై అసహనం ఉంటే అడగాలి కాని, విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. మంత్రి నారా లోకేష్ కు 19 అవార్డులు రావడానికి కేంద్రం ఇచ్చిన నిధులు కారణం కాదా? అని ప్రశ్నించారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపిన ఘనత కూడా బీజేపీదే అని చెప్పారు. మిత్రపక్షంగా ఉన్న తమపై విమర్శలు గుప్పించడం సరికాదని అన్నారు.

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీలు టీజీ వెంకటేశ్, రాయపాటి సాంబశివరావులు విమర్శలు గుప్పించడాన్ని సోము వీర్రాజు తప్పుబట్టారు. మోదీది పేదల ప్రభుత్వమని... వ్యాపారాలు చేసుకునే ఇలాంటి ఎంపీల కోసం పని చేసే ప్రభుత్వం కాదని అన్నారు. పొగాకు బండిల్స్ లో రాళ్లు నింపి, చైనాకు ఎగుమతి చేసిన చరిత్ర రాయపాటిదని... అలాంటి వ్యక్తి కూడా మోదీని విమర్శిస్తారా? అంటూ మండిపడ్డారు.

కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో చక్రం తిప్పిన మాట వాస్తవమేనని... కాంగ్రెస్ మద్దతుతో ఆయన చక్రం తిప్పారని, ఇద్దరు వ్యక్తులను ప్రధానమంత్రులను చేశారని వీర్రాజు అన్నారు. మళ్లీ అలాంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఈ ఇద్దరు ఎంపీలు భావిస్తున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. 

More Telugu News