Venkaiah Naidu: అందంగా లేకపోయినా హీరో కొడుకు హీరో అవుతున్నాడు!: వెంకయ్యనాయుడు

  • రైతులు బాగుండాలి
  • విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి
  • దేశానికి ఆహారం అందించేది రైతే

భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని... వ్యవసాయం లాభసాటిగా ఉండాలని, రైతు సంతోషంగా ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడని, లాయర్ కొడుకు లాయర్ అవుతున్నాడని, బిజినెస్ మ్యాన్ కొడుకు బిజినెస్ మ్యాన్ అవుతున్నాడని, అందంగా లేకపోయినా హీరో కొడుకు హీరో అవుతున్నాడని... కానీ, రైతులు మాత్రం తన కొడుకు రైతు కావద్దని కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

130 కోట్ల మందికి ఆహారాన్ని అందించే వ్యక్తి రైతు అని అన్నారు. రైతులు బాగుండాలని, తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసి, విదేశీ మారకద్రవ్యాన్ని మన దేశానికి తెప్పించే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర ఉండాలని, పంటను నష్టపోతే వెంటనే పరిహారం ఇప్పించాలని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్వర్ణోత్సవాలను వెంకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు.

గురువు లేకుంటే గూగుల్ కూడా పని చేయదనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని వెంకయ్య అన్నారు. విద్య అన్నింటికంటే ముఖ్యమైనదని చెప్పారు. విద్య నేర్చుకోవడం ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

More Telugu News