kushboo: ఖుష్బూ పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యాలయం మూసివేత!

  • తమిళనాడులోని తిరునల్వేలి డీసీసీ కార్యాలయానికి తాళం
  • జిల్లా నాయకులను, సామాన్య కార్యకర్తలను ఖుష్బూ పట్టించుకోవట్లేదంటున్న స్థానిక నేతలు
  • పార్టీ ప్రతిష్టను దిగజార్చొద్దంటూ ఖుష్బూ హితవు

ఏఐసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ సినీ నటి ఖుష్బూపై తమిళనాడు కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. తిరునల్వేలి పట్టణం కాంగ్రెస్ విభాగం నాయకులు ఆమె తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో తిరునల్వేలిలో నిన్న సాయంత్రం ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం చెన్నై నుంచి విమానంలో తూత్తుకుడి వెళ్లారు. అయితే, తన పర్యటన గురించి తిరునల్వేలి కాంగ్రెస్ నాయకులకు ఆమె ఎటువంటి సమాచారమివ్వలేదట.

దీంతో, ఆమె పర్యటనను నిరసిస్తూ తిరునల్వేలిలోని డీసీసీ కార్యాలయాన్ని స్థానిక నాయకులు మూసివేసి తాళం వేశారు. ఈ విషయమై స్థానిక నాయకుడు ఒకరు మాట్లాడుతూ, జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలను గానీ, సామాన్య కార్యకర్తలను గాని ఆమె పట్టించుకోవడం లేదని, ఆమె తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయమై నటి ఖుష్బూ స్పందిస్తూ, పార్టీని అభివృద్ధి పరిచే ఆలోచనతో జిల్లా వారి పర్యటనలు చేపడుతుంటే, సొంతపార్టీ నాయకులే అడ్డుపడటం సబబు కాదని, పార్టీ ప్రతిష్ఠను దిగజార్చే చర్యలకు పాల్పడవద్దని ఆమె హితవు పలికారు.

More Telugu News