Andhra Pradesh: కర్నూలులో స్టేట్ కేన్సర్ సెంటర్ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తాం: మంత్రి కామినేని

  • వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన కామినేని
  • ఆయుష్, ఏపీ శాక్స్, ఐపియమ్ శాఖల పని తీరుపై ప్రత్యేక దృష్టి
  •  ఏపీలో జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహించడంపై చర్చ

కర్నూలులో స్టేట్ కేన్సర్ సెంటర్ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేసి, టెండర్లు నిర్వహిస్తామని ఏపీ  వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు ఆయన సమావేశం నిర్వహించారు. ఏపీ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖా పరంగా పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ, స్టేట్ కేన్సర్ సెంటర్ నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని అన్నారు. ఆయుష్ శాఖలో ఉన్న ఆసుపత్రులను తక్షణమే బలోపేతం చేయాలని, తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ఆదేశించారు.

నకిలీ ఆయుర్వేద మందులను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని, యోగ, న్యాచురోపతిపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, అనంతపురం జిల్లా హిందూపురం, చిత్తూరు జిల్లా మదనపల్లి, నెల్లూరు జిల్లా ఆత్మకూరు, ప్రకాశం జిల్లా మార్కాపురం ఆసుపత్రులను జిల్లా ఆసుపత్రులుగా మార్చాలని కోరుతూ ఆర్థిక శాఖకు నివేదిక పంపించామని, నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో ఎస్సార్ లుగా పని చేస్తున్న వైద్యులకు జీతాలు చెల్లింపు విషయమై ట్రెజరి డైరక్టర్ తో కామినేని మాట్లాడారు. ఆ డాక్టర్లకు వెంటనే జీతాలు చెల్లించాలని డీఎమ్ఈ ని ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ (ఏపీ.ఎమ్.ఎస్.ఐ.డి.సి) సూచించిన ప్రభుత్వ ఆసుపత్రులలో శిథిలావస్థకు చేరిన భవనాలను వెంటనే తొలగించాలని మంత్రి ఆదేశించారు. ఆయుష్, ఏపీ శాక్స్, ఐపియమ్ శాఖల పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా విద్యార్ధులకు హోమియో మందులు పంపిణి చేయాలని, వెల్ నెస్ సెంటర్లు తక్షణం ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఏపీలో నిర్వహించే అంశంపై చర్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

More Telugu News