Andhra Pradesh: కోడి పందేల్లో పాల్గొన్నారని 95 మందిని జైలుకు పంపిన ఏపీ కోర్టు!

  • మూడు రోజుల జైలు, రూ.100 చొప్పున జరిమానా
  • నిషేధం ఉన్నా ఏపీలో జోరుగా కోడి పందేలు
  • ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి

సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కోడి పందేల్లో పాల్గొన్న 95 మందిని ఆంధ్రప్రదేశ్‌లోని  స్థానిక కోర్టు జైలుకు  పంపింది. మూడు రోజుల జైలు శిక్ష విధించడంతోపాటు ఒక్కొక్కరికి వంద రూపాయల చొప్పున జరిమానా విధించింది.

కోడి పందేలను నిషేధించినప్పటికీ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో జోరుగా పందేలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన పందేల్లో పాల్గొన్న 95 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ‘ఏపీ గేమింగ్ యాక్ట్, 1947’ ప్రకారం సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేశారు.

కోడి పందేలను ఆపడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న హైకోర్టు వ్యాఖ్యలతో కదిలిన పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఇక ఏపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు కోడి పందేలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. పోటీల్లో పాల్గొన్న రాజకీయ నాయకుల పేర్లు ఇవ్వాలని ఆదేశించింది.

కాగా, కోడి పందేల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన కోర్టు మొత్తం 95 మందికి మూడు రోజుల జైలు శిక్షతోపాటు రూ.100 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో వారిని తాడేపల్లిగూడెం, తణుకు  సబ్-జైళ్లకు తరలించారు.

More Telugu News