TTD: ఆరోపణలు వచ్చినా... టీటీడీ చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్!

  • కడప జిల్లాకు చెందిన పుట్టాకు పదవి
  • ఆయన క్రిస్టియన్ సంస్థలకు దగ్గరన్న శివస్వామి
  • అభ్యంతరాలు వ్యక్తమైనా ఆయనవైపే చంద్రబాబు మొగ్గు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్‌ గా కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పేరును ఆంధ్రప్రదేశ్ సీఎం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. నేడో, రేపో ఆయన పేరుతో పాటు, కొత్త పాలక మండలిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, సుధాకర్‌ యాదవ్‌ క్రిస్టియన్ సంస్థలకు దగ్గరగా ఉన్నారని, హిందూ ధర్మంపై పూర్తి విశ్వాసం ఉన్న వాళ్లనే టీటీడీ చైర్మన్ గా నియమించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ తో పాటు పలువురు మఠాధిపతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ, పలువురితో చర్చించిన అనంతరం పుట్టా నియామకానికే సీఎం మొగ్గు చూపారని తెలుస్తోంది.

సుధాకర్ యాదవ్ క్రిస్టియన్ సంస్థలతో సన్నిహితంగా ఉంటారని గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలోని శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి గతంలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డిని తిరిగి టీడీపీపీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తున్న తెలుగుదేశం, తదుపరి ఎన్నికల్లో డీఎల్‌ కు మైదుకూరు టిక్కెట్ ఇవ్వాలంటే, ఆ ప్రాంతంలోని టీడీపీ నేత సుధాకర్‌ కు మరో పదవి ఇవ్వాల్సి వున్నందునే పుట్టాకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారని తెలుస్తోంది.

More Telugu News