vikram goud: విక్రమ్ గౌడ్ కాల్పుల వ్యవహారంలో పోలీసులకు అందిన ఫోరెన్సిక్ నివేదిక

  • రెండు తూటాలు ఒకే తుపాకి నుంచి వచ్చినవని  నిర్ధారణ
  • గతేడాది ఫిలింనగర్‌లో విక్రమ్ గౌడ్‌పై కాల్పులు
  • రాజకీయ లబ్ధికోసమే కాల్పులు జరిపించుకున్నట్టు విక్రమ్ గౌడ్‌పై ఆరోపణ

మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పుల వ్యవహారంలో పోలీసుల చేతికి ఫోరెన్సిక్ నివేదిక అందింది. ఘటనా స్థలంలో లభించిన రెండు తూటాలు ఒకే తుపాకి నుంచి వచ్చినవని తేలింది. గతేడాది హైదరాబాద్, ఫిలింనగర్‌లో విక్రమ్ గౌడ్‌పై దుండగులు కాల్పులు జరపగా ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అయితే కాల్పుల వ్యవహారానికి సూత్రధారి విక్రమేనని ఆరోపణలు వచ్చాయి.

రాజకీయ లబ్ధి కోసం తన మనుషులతోనే ఈ డ్రామాకు తెరతీశాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు విక్రమ్‌ను అరెస్ట్ చేశారు. ఘటనా స్థలంలో దొరికిన తూటాను, విక్రమ్ శరీరంలో లభించిన మరో తూటాను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. గురువారం ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు పోలీసులకు అందింది. రెండు తూటాలు ఒకే తుపాకి నుంచి వచ్చినవి నివేదికలో తేలడంతో కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

More Telugu News