budget 2018-19: కేంద్ర బడ్జెట్ లో ‘చేనేత’కు అన్యాయం: వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ఏపీ కన్వీనర్

  • చేనేత కార్మికుల ఆశపై నీళ్లు
  • 'ఓట్ ఆన్ అకౌంట్' లో నిధులు పెంచాలి
  • వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్

కేంద్ర బడ్జెట్లో చేనేత రంగానికి అన్యాయం జరిగిందని వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ఏపీ కన్వీనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో చేనేతకు కేవలం రూ.396 కోట్లు మాత్రమే కేటాయించడం అన్యాయమని అన్నారు. దేశ వారసత్వ సంపదైన చేనేతకు ఈ బడ్జెట్ లో న్యాయం జరుగుతుందని చేనేత కార్మికులు ఆశగా ఎదురు చూశారని, కానీ వారి ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని వాపోయారు.

చేనేత రంగంపైన, చేనేత కార్మికులపైన ఇంత వివక్ష తగదని, దిగజారుడు కేటాయింపుల ద్వారా చేనేత రంగం నడ్డి విరిచిందని కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఉపాధి ఎక్కువగా పొందే రంగం చేనేతని, ఈ రంగంలో సుమారు 4 కోట్ల మంది ప్రత్యక్షంగా, 15 కోట్ల మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో 3 లక్షల మంది ప్రత్యక్షంగా, 8 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని, గత సంవత్సరం చేనేత రంగంపై జీఎస్టీ విధించడం వల్ల చేనేత ఉత్పత్తులు,అమ్మకాలు తగ్గి నేత కార్మికులకు ఉపాధి కరవైందని అన్నారు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో చేనేతకు అరకొర నిధులు కేటాయించడం వల్ల ఈ రంగం కుంటుపడటం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానపరమైన లోపాల వల్ల చేనేత రంగానికి తీవ్ర నష్టం జరుగుతోందని వాపోయారు. త్వరలో జరిగే 'ఓట్ ఆన్ అకౌంట్'లో చేనేతకు కేంద్రం సరిపడ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.  

  • Loading...

More Telugu News